logo

అన్నయ్యా.. బైకు అమ్మి అప్పులు తీర్చండి

‘అన్నయ్యా అమ్మా, నాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నేను వెళ్తున్నా’ అంటూ చరవాణిలో తన అన్నకు ఓ యువకుడు చివరి మాటలు చెప్పి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి సైఫాన్‌ వంతెనపై పోలవరం కుడికాలువ వద్ద సోమవారం చోటుచేసుకుంది.

Published : 30 Apr 2024 09:18 IST

చరవాణిలో చెప్పి యువకుడి ఆత్మహత్య

ప్రవీణ్‌కుమార్‌ (పాత చిత్రం)

నల్లజర్ల, న్యూస్‌టుడే: ‘అన్నయ్యా అమ్మా, నాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నేను వెళ్తున్నా’ అంటూ చరవాణిలో తన అన్నకు ఓ యువకుడు చివరి మాటలు చెప్పి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి సైఫాన్‌ వంతెనపై పోలవరం కుడికాలువ వద్ద సోమవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్ల మండలం నభీపేట గ్రామానికి చెందిన మర్రి ప్రవీణ్‌కుమార్‌ (26) వరికోత మిషన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ప్రసన్న అనే యువతితో రెండేళ్ల క్రితమే వివాహమయ్యింది. తల్లిదండ్రులు గంగరాజు, పద్మ, అన్నయ్య రవితేజలతో కలసి గ్రామంలో ఒకే ఇంట్లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం ప్రవీణ్‌ ఇంటి వద్ద నుంచి వెళ్లిన కాసేపటికి తన అన్న రవితేజతో చరవాణిలో ఏడుస్తూ మాట్లాడాడు. తను కొంతమంది వద్ద పనికి వస్తానని చెప్పి ముందస్తుగా నగదు తీసుకున్నానని, వాటిని ద్విచక్రవాహనం అమ్మి తీర్చండని, అనంతపల్లి కాలువలోకి దూకేస్తున్నానని చెప్పి మాట్లాడడం మానేశాడు. దీంతో కంగారుపడిన రవితేజ తన మిత్రులతో కలిసి ప్రవీణ్‌ చెప్పిన స్థలానికి వెళ్లి వెతికారు. అక్కడ వంతెనపై ప్రవీణ్‌ చరవాణి, ద్విచక్రవాహనం, పాదరక్షలు కనపడడంతో నల్లజర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రానికి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నల్లజర్ల పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని