logo

జగనన్న ఏలు‘బడి’లో ఇంతే..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు.

Published : 04 May 2024 04:59 IST

అయిదేళ్లుగా విజ్ఞాన యాత్రలు లేవ్‌..
ఒక్క పైసా కూడా విదల్చని ప్రభుత్వం
న్యూస్‌టుడే, ముమ్మిడివరం

ముమ్మిడివరంలో విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. చదువుకునే పాఠశాలకు సమీపంలో ఉండే పర్యాటక ప్రదేశాలు, ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా.. కొత్త విషయాలను తెలుసుకోవడం.. వారిలో కొత్త ఆలోచనలు వచ్చి వినూత్న ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం ఉండేది. వైకాపా పాలన వచ్చిన తర్వాత విజ్ఞాన యాత్రలకు మంగళం పాడేశారు.

నాడు-నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించి వాటి రూపురేఖలు మార్చేశాం.విద్యార్థులకు ట్యాబ్‌లు, డిజిటల్‌ బోధన, టోఫెల్‌ పరీక్షలు, బైజూస్‌ కంటెంట్‌తో పాఠాలు.. ఇలా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సామర్ధ్యం పెంచడానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం.

ఇవి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభలో చెప్పే ఊకదంపుడు ఉపన్యాసంలోని సారాంశం.

విద్యార్థుల సామర్ధ్యాలు.. వారి వ్యక్తిత్వ వికాసానికి విజ్ఞాన యాత్రలు ఎంతగానో దోహదపడతాయని ముఖ్యమంత్రికి తెలియదా..? వైకాపా పాలన వచ్చిన తర్వాత విజ్ఞాన యాత్రల నిర్వహణకు ఇవ్వాల్సిన గ్రాంట్లకు జగన్‌మామ పూర్తిగా మంగళం పాడేశారు.

పాఠశాల నిర్వహణ నిధులనే ఇవ్వడం లేదు..

పాఠశాల నిర్వహణకు ఇవ్వాల్సిన నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. కనీసం సుద్ధముక్క కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. చాలా వాటికి ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. పరీక్షల ప్రశ్నాపత్రాలను కూడా వాట్సాప్‌లో పెట్టి బోర్డుపై రాసి పిల్లలను రాసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే విజ్ఞాన యాత్రలకు డబ్బులు ఇస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.

ఓ ప్రధానోపాధ్యాయుడి ఆవేదన

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 9,10 తరగతులు చదివే విద్యార్థులు సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వారిని విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లడానికి ఏటా రూ.కోటి గ్రాంటు   సరిపోతుంది.  ఈ కొద్దిపాటి నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం.. ఐదేళ్లుగా యాత్రలను నిలిపివేయడం చూస్తే.. జగన్‌కు సర్కారీ బడుల్లో విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. గతంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) ఉండేది. ఆర్‌ఎంఎస్‌ఏ గ్రాంట్లు విడుదలయ్యేవి. ఏటా కార్తిక మాసం రాగానే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లే వారు.  జగనన్న ఏలు‘బడి’లో విద్యార్థులకు ఆ యోగం లేకుండా పోయింది. 

విజ్ఞాన యాత్రల ద్వారా ఎన్నో విషయాలు

గతంలో ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు కొంత విద్యార్థులు వేసుకుని విజ్ఞాన యాత్రలకు వెళ్లేవారు. కొత్త ప్రాంతాలు సందర్శించి అక్కడ విద్యా విషయక, వైజ్ఞానిక అంశాలు తెలుసుకునేవారు. ఈ యాత్రల వల్ల విద్యార్థులు వినూత్న ప్రయోగాలు, ఆలోచనలకు అవకాశం ఉంటుందని.. ఇవి లేకపోవడంతో అభ్యసనా సామర్ధ్యాలు కుంటుపడు తున్నాయని ఉపాధ్యాయులే చెబుతున్నారు. నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి బోధన చేయడంతో పాటు.. నేరుగా కొత్త అంశాలను చూపిస్తే త్వరగా అర్థం చేసుకుంటారంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని