logo

శిరోముండనం కేసుపై అప్పీలుకు వెళ్లాలి

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 05 May 2024 03:47 IST

బాధితులు, విదసం నాయకుల డిమాండ్‌

బాధితులకు న్యాయం చేయాలని కలెక్టరేట్‌ ఎదుట విదసం నేతల నిరసన

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బాధితులతో కలిసి వారు శనివారం నిరసన తెలిపారు. నేరం జరిగే సమయానికి నిందితుడు తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఉన్నారన్న విషయం విశాఖ ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వారు వాపోయారు. దీంతో కోర్టు ఇచ్చిన తీర్పు నేర తీవ్రతకు తగ్గట్లుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఈ విధమైన చర్యలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉండాలని, ప్రభుత్వం నిందితులకు కొమ్ముకాస్తూ బాధితులకు మొండి చేయి చూపుతోందని వారు ఆరోపించారు. తక్షణం ప్రభుత్వం అప్పీలకు వెళ్లి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామన్నారు. అనంతరం డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వి.రామకృష్ణ, బళ్ల కుమార్‌, కె.రాము, ఇక్బాల్‌, రాజేశ్‌, రేవు తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.


తగిన న్యాయం చేయలేదు..

మాకు అన్యాయం జరిగి 27 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. వైకాపా ప్రభుత్వం నిందితుల పక్షాన నిలిచి  తీవ్ర అన్యాయం చేసింది.  ఈ కేసు విషయంలో విశాఖ కోర్డు ఇచ్చిన తీర్పు మాకు న్యాయ సమ్మతంగా అనిపించలేదు. దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ప్రభుత్వం కూడా సహకరించాలి.

చల్లపూడి పట్టాభిరామయ్య, శిరోముండనం బాధితుడు


నిందితులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం..

శిరోముండనం కేసులో నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. తక్షణం ఈ కేసులో శిక్ష పడిన తోట త్రిమూర్తుల్ని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించి, తక్షణం శిక్ష అమలు చేయాలి. బాధితులకు న్యాయం చేయడంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. ఈ కేసుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

భూషి వెంకట్రావు, విదసం నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని