logo

బీమా.. జగన్‌ డ్రామా..!

ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.

Published : 05 May 2024 03:49 IST

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అటువంటి సమయంలో వారిని ఆదుకుని, అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న బీమా పథకం పేరు మార్చడమే కాకుండా పూర్తిగా అటకెక్కించింది జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కక రోడ్డున పడుతున్నాయి. అయినా పాలకులకు పట్టడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసినా పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో..

తెదేపా ప్రభుత్వం హయాంలో చంద్రన్న బీమా పథకం పక్కాగా అమలయ్యేది. సహజ మరణం పొందిన 50 ఏళ్ల వయస్సు ఉన్న వారికి  రూ.2 లక్షలు, 50 నుంచి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేలు పరిహారం అందించేవారు. కుటుంబలో ఎవరు చనిపోయినా పరిహారం దక్కేది. ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు అందించేవారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌తో సంబంధం లేకుండా పరిహారం వర్తింపజేసేవారు. ఆ మొత్తం రెండు నెలల్లో బాధితులకు చేరేది.

ఇప్పుడిలా..

వైఎస్‌ఆర్‌ బీమా పథకంలో మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల మంది వరకు పాలసీదారులను నమోదు చేశారు. 18-50 ఏళ్లు ఉండి సంపాదించే వ్యక్తి సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రూ.లక్ష, 18-70 ఏళ్ల మధ్య సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు  మృతి చెందితే  రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. తర్వాత మార్చిన నిబంధన ప్రకారం కుటుంబ యజమాని చనిపోతేనే పరిహారం అందుతుంది. మిగిలిన సభ్యుల్లో ఎవరు మరణించినా పరిహారం రాదని మెలిక పెట్టారు.  50 ఏళ్లు దాటిన కుటుంబ యజమాని సహజ మరణం పొందితే పరిహారం వర్తించదు. తెదేపా ప్రభుత్వ హయాంలో బీమా కార్డులో ఉన్న వారందరికీ పథకం వర్తించేది. ఇప్పుడు ఒక కార్డును ఒక్కరికే పరిమితం చేశారు.

మట్టి ఖర్చులకు మంగళం..

మరణం సంభవించిన రోజునే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. కాని వైకాపా ప్రభుత్వంలో నెలలు గడిచినా ఇవ్వడం లేదు. ప్రమాద మరణాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌, మరణ ధ్రువీకరణ పత్రం, శవ పరీక్ష నివేదిక(పోస్టుమార్టం రిపోర్ట్‌) ఉంటేనే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. రహదారి ప్రమాదాల్లో చనిపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధన కచ్చితం చేశారు. ఈ కారణంతో ప్రతీ సంవత్సరం అనేక మంది బాధితులు ఈ పథకానికి దూరం అవుతున్నారు.

మూడేళ్లలో  1683 మందికే లబ్ధి..

జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ బీమా పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2500 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో కేవలం 1683 మందికి మాత్రమే పరిహారం అందించారు. మిగిలిన వారు పరిహారం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులను అడుగుతున్నా వారి వద్ద నుంచి ఏవిధమైన సమాచారం రావడం లేదని వారు వాపోతున్నారు.

మూడేళ్లు అయినా రాలేదు

నా భార్య సత్యవతి 2021లో మరణించింది. వెంటనే వైఎస్సార్‌ బీమా పథకానికి దరఖాస్తు చేశాం. అధికారులు అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపన చేశారే తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అధికారులను గట్టిగా నిలదీస్తే కేవలం కుటుంబ యజయానికి మాత్రమే ఇస్తున్నామన్నారు. ఇది చాలా దారుణం. 

ఆదుర్తి దుర్గారావు, బోడసకుర్రు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని