logo

కాకినాడను ‘మరో పులివెందుల’ చేస్తారా?

కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు.

Published : 05 May 2024 04:07 IST

రూ.15 వేల కోట్ల బియ్యం తరలించిన దుర్మార్గులు వీళ్లు
డ్రగ్‌ సిటీగా మార్చేశారు
కాకినాడ ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కాకినాడ నగరం, సర్పవరం జంక్షన్‌, కరప

సభలో మాట్లాడుతున్న చంద్రబాబు, చిత్రంలో కూటమి అభ్యర్థులు కొండబాబు, పంతం నానాజీ, ఉదయ్‌ శ్రీనివాస్‌

కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. గోదావరి జిల్లాలంటే ప్రశాంతతకు మారు పేరు. గౌరవం ఇస్తారు. అయిదేళ్లు ఏమైంది. రౌడీయిజం, నేరాలు పెరిగాయా లేదా..? గంజాయి వచ్చిందా లేదా..? ఏమిటీ అరాచకం.. పవిత్ర గోదావరి సాక్షిగా చెబుతున్నా.. ఇలాంటి దుర్మార్గులు వచ్చి జిల్లాను మరో పులివెందుల చేస్తామంటే వదిలిపెట్టమని హెచ్చరించారు. కాకినాడ సిటీని నాశనం చేసినవారిని ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

రోడ్‌షోలో చంద్రబాబు

మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా..

ఉద్యోగులు, పోలీసులు, యూనియన్లను జగన్‌ బెదిరించాడని.. మాట్లాడితే కేసు పెట్టి లోపల వేయించాడని.. ఆ బెదిరింపులను తాను, పవన్‌కల్యాణ్‌ లెక్కచేయలేదని చంద్రబాబు అన్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తానన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగం చేసుకోవాలని..ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ‘ఎవ్వరూ భయపడొద్దు..మీ ప్రాణానికి మా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటామ’ని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

తూరంగి వద్ద సైకిళ్ల హారం

వీళ్లను భూస్థాపితం చేద్దాం

‘ఈయన ఎమ్మెల్యే (కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి).. వీళ్ల నాన్న సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ఛైర్మన్‌, తమ్ముడు రైస్‌ మిల్లర్ల అసోషియేషన్‌ అధ్యక్షుడు.. దొంగలకు తాళాలు ఇచ్చాడు జగన్‌.. రూ.15 వేల కోట్ల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా రవాణా చేసిన దుర్మార్గులు వీళ్లు.. అతి పెద్ద స్కాం ఇది..’ వీళ్లను భూస్థాపితం చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాకినాడను డ్రగ్‌ సిటీగా మార్చేశారన్నారు. సిటీ భూకబ్జాలు, అరాచకాలు, రౌడీయిజం, గూండాయిజం, క్రికెట్‌ బెట్టింగులు, పేకాట క్లబ్బులకు నిలయంగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

సభకు హాజరైన అశేష జనం

సైకో రాడని పోలీసులకూ తెలిసిపోయింది

ప్రజాగళం సభకు పోలీసులు పటిష్ట బందోస్తు కల్పించారు. సభా ప్రాంగణం నలువైపులా పహారా కాయడంతోపాటు జనాలు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు సైతం సభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీసులు బందోబస్తు బాగానే చేస్తున్నారంటూ కితాబునిచ్చారు. సైకో జగన్‌ రాడని వారికి కూడా తెలిసిపోయిందన్నారు. ‘పోలీసులు మంచోళ్లే.. ఏం చేస్తాం.. జగన్‌ ఒత్తిడితో వారు ఆయన చెప్పినట్లు పనిచేయాల్సి వస్తోంద’ని వ్యాఖ్యానించారు.

కాకినాడలో రహదారి పొడవునా బారులుదీరిన మహిళలు

పవన్‌కల్యాణ్‌ కాలిగోటికి సరితూగవు..

‘ఇక్కడున్న ఎమ్మెల్యేకి కొవ్వెక్కింది. పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌ విసురుతావా? ఆయన కాలిగోటికి కూడా నువ్వు సరితూగవు ఖబడ్దార్‌. ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో. దోపిడీ చేసినంత సులువు కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడం. రౌడీలను నిర్మొహమాటంగా అణిచివేస్తాం. నిజ జీవితంలోనూ గబ్బర్‌సింగ్‌ పవన్‌కల్యాణ్‌. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రాష్ట్రాన్ని దోపిడీ చేసి, కొవ్వెక్కి డబ్బుల మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు. వీరందరికీ కళ్లెం వేస్తా’మని చంద్రబాబు అన్నారు. సభలో కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌.. కాకినాడ నగర, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ

తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని