logo

ప్రజాగళం.. సర్వం సన్నద్ధం

సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ,

Updated : 06 May 2024 07:11 IST

నేడు ఒకే వేదికపై ప్రధాని మోదీ, పవన్‌, లోకేశ్‌
5 పార్లమెంట్‌ స్థానాల నుంచి రెండు లక్షల మంది వస్తారని అంచనా

వేమగిరిలో ప్రజాగళం సభకు ముస్తాబైన వేదిక

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, కడియం: సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హాజరవనున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మూడు పార్టీల ముఖ్యనేతలూ రానున్నారు. కూటమితో భాజపా కలిసిన తర్వాత తొలిసభ చిలకలూరిపేటలో జరగ్గా.. రెండో సభకు రాజమహేంద్రవరం వేదికైంది.

చారిత్రక నగరానికి వస్తూ..

చారిత్రక నగరంగా ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరానికి ప్రధాని మోదీ రానుండడంతో అంతటా ఆసక్తి పెరిగింది. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం బరిలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి, ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో జరిగే అభివృద్ధిని మోదీ వివరించనున్నారు.

సభకు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, నర్సాపురం లోక్‌సభ స్థానాల పరిధిలోని ఎంపీ అభ్యర్థులతో పాటు సుమారు 2 లక్షల మంది జనం వస్తారని అంచనా.

విశాల ప్రాంగణంలో ఏర్పాట్లు..

తెదేపా మహానాడు నిర్వహించిన వేమగిరి మైదానంలోనే ఎన్డీఏ ‘ప్రజాగళం’ బహిరంగ సభ జరగనుంది. 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. భారీ వేదికలు, పందిళ్లు వేశారు. కూలర్లు, ఏసీలు ఉంచారు. వాహనాల పార్కింగ్‌కు జాతీయ రహదారి పక్కన 10 స్థలాలు ఏర్పాటు చేశారు.

3 వేలమంది మంది బలగాలు..

చిలకలూరిపేటలో ప్రధాని బహిరంగ సభలో భద్రతాపరమైన లోపాలు తలెత్తడం, పలువురు ఐపీఎస్‌లపై వేటు పడిన క్రమంలో ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సివిల్‌ పోలీసులు, కేంద్ర బలగాలు కలిపి 3వేల మంది విధుల్లో ఉన్నారు. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. పలు రాష్ట్రాల ఐజీలు, ఉన్నతాధికారులు సభాస్థలి వద్ద ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఎస్పీ జగదీశ్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

మారిన షెడ్యూల్‌..

తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సభావేదిక వద్దకు రావాల్సి ఉంది. తిరుగు ప్రయాణ సమయం, భద్రతా కారణాలతో మధ్యాహ్నం 3 గంటలకే ప్రధాని సభాస్థలికి చేరుకుంటారు. 3.45 గంటలకు సభ ముగించి అనకాపల్లి వెళ్తారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్నికల బాధ్యుడు సాగి కాశీవిశ్వనాథరాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని