logo

ఈసారి గెలిపిస్తే చేస్తారట.. ఈ అయిదేళ్లూ ఏం చేశారో..

అయిదేళ్లు ఎంపీగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ చూడనంతగా నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రమాణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌రామ్‌.

Published : 07 May 2024 04:34 IST

వైకాపా అభ్యర్థి భరత్‌ హామీలపై నగరవాసుల విస్మయం

వి.ఎల్‌.పురం, న్యూస్‌టుడే: అయిదేళ్లు ఎంపీగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ చూడనంతగా నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రమాణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌రామ్‌. పుష్కరఘాట్‌ వద్ద ‘భరత్‌ టెన్‌ ప్రామిసెస్‌’ పేరుతో కూడిన కరపత్రాలను ఆయన ఈ నెల 4న ఆవిష్కరించారు. ఈసారి గెలిపిస్తే ఇవన్నీ చక్కదిద్దేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఈసారి సరే.. మరి ఈ అయిదేళ్లూ ఏం చేసినట్టు అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.


24 గంటలూ తాగునీరు ఇచ్చేస్తారట!

వైకాపా ఎంపీగా భరత్‌రామ్‌ రకరకాల ప్రకటనలు చేయడమే తప్ప ఆయా డివిజన్లలో పైపులైన్ల వ్యవస్థను మెరుగు పరచలేకపోయారు. కలుషిత జలాల కారణంగా అతిసారంతో నగరంలో ఇద్దరు మృతిచెందినా పట్టలేదు. వి.ఎల్‌.పురంతో పాటు నివాసానికి సమీపంలో ఉన్న ఆర్టీసీ కాలనీలోనూ పూటకు అరగంట కూడా సక్రమంగా తాగునీరు అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. గోదావరి చెంతనే ఉన్నా తాగునీటికి నగరవాసులు అల్లాడిపోయే పరిస్థితి. ఎంపీ వాగ్దానంపై పలువురు నగరవాసులు పెదవి విరుస్తున్నారు.


బ్లేడ్‌ బ్యాచ్‌లను అరికట్టలేకపోయారు

ఎంపీగా ఉండి కూడా బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోయినప్పటికీ తాను ఎమ్మెల్యే అయితే రౌడీషీటర్లు, బ్లేడ్‌, గంజాయి బ్యాచ్‌లను నగర బహిష్కరణ చేస్తానని భరత్‌ చెప్పుకొచ్చారు. ఎంపీ పరిధి ఎక్కువ.. అప్పుడే చేయలేనిది ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలా చేస్తారన్నది జనం మాట.


విశ్వనగరంగా మారుస్తారా..  

రివర్‌ సిటీ అందాలు చూసేలా ఘాట్లను ఏకం చేయడంతో పాటు గోదావరి బండ్‌ను హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని, విశ్వనగరంగా చేసేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కార్పొరేషన్‌ నిధులతో అభివృద్ధి చేసిన కంబాల చెరువు పార్కులోకి ఫీజు లేకుండా అడుగుపెట్టలేని విధంగా మార్చేశారని, ఇంకా విశ్వనగరం మారిస్తే తమ పరిస్థితేంటని పలువురి ప్రశ్న. విశ్వనగరం సంగతి దేముడెరుగు.. కనీస సౌకర్యాలు కల్పించాలన్నది సామాన్యుడి మాట.


స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతారట

వి.ఎల్‌.పురంలో స్టేడియం నిర్మాణానికి ఏడాదిన్నర కిందట మంత్రి రోజా చేతుల మీదుగా ఆర్భాటంగా శంకుస్థాపన చేసినప్పటికీ శిలాఫలకం కనుమరుగైందే తప్ప.. నేటికీ పనులు మొదలుకాలేదు. ఇప్పుడేమో నగరాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, క్రీడాకారుల కోసం ఇండోర్‌ స్టేడియం తీసుకొస్తున్నానని హామీ ఇచ్చారు. దీనిపైనా ఔత్సాహిక క్రీడాకారులు విస్తుపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని