logo

నేడు ఇంటి నుంచే ఓటు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి, గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందిపడేవారు.

Published : 07 May 2024 04:44 IST

అవగాహన లోపం.. అర్హులు స్వల్పం

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి, గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందిపడేవారు. ఆ పరిస్థితి నుంచి వారికి విముక్తి కల్పించేందుకు ఇంటి వద్దనుంచే ఓటేసే సదుపాయాన్ని ఈ ఎన్నికల్లో కల్పించారు. కానీ ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంలో విఫలం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 8,343 మంది, దివ్యాంగులు 25,998 కలిపి మొత్తంగా 34,341 మంది ఉన్నారు. వీరంతా ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులే. కానీ వీరికి అధికారులు ఈ ప్రక్రియపై అవగాహన అంతగా కల్పించలేదు. ఎక్కడా ఇంటి వద్ద నుంచి ఓటేసే కార్యక్రమంపై ఒక్క చైతన్య కార్యక్రమం కూడా నిర్వహించలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా కేవలం 1,251 మంది మాత్రమే హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హుల్లో 3 శాతం మంది మాత్రమే ఈ విధానానికి సుముఖత వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాలకు రాలేక ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోంది. దీనిని అరికట్టాలనే సదుద్ధేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన విధానం క్షేత్ర స్థాయిలో అధికారుల అలసత్వంతో చాలామంది అర్హులకు దూరమైంది.

73 బృందాల ఏర్పాటు..

జిల్లా వ్యాప్తంగా అర్హుల నుంచి హోం ఓటింగ్‌ ప్రక్రియలో ఓట్లు సేకరించేందుకు 73 బృందాలను నియమించారు. వీరికి 85 వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ మంగళవారం ప్రారంభించి ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల మాదిరిగా వీరి ఓట్లు కూడా ప్రత్యేకంగా భద్రపరిచి స్ట్రాంగ్‌ రూంలకు తరలించనున్నట్లు కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలతోపాటుగా కేంద్రాలకు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని