logo

బీసీలపై కక్ష.. కోతలతో శిక్ష

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో వెనకబడిన తరగతుల నడ్డివిరిచారు. రాయితీ రుణాలు నిలిపివేసి స్వయం ఉపాధికి ముగింపు పలికారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం బీసీల స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారు.

Updated : 07 May 2024 05:48 IST

అయిదేళ్ల జగన్‌ పాలనలో రాయితీ రుణాలకు ఎగనామం
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో వెనకబడిన తరగతుల నడ్డివిరిచారు. రాయితీ రుణాలు నిలిపివేసి స్వయం ఉపాధికి ముగింపు పలికారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం బీసీల స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారు. 2014 నుంచి 2019 వరకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాయితీ రుణాలు కల్పించి రూ.కోట్లలో లబ్ధి చేకూర్చారు. జగన్‌ సర్కార్‌ వచ్చాక.. బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. సంస్థను 56 విభాగాలుగా విభజించి, కార్పొరేషన్లు ప్రకటించి, పాలకవర్గాలు నియమించి, పైసా ఇవ్వకుండా మొండి చేయి చూపారు. అయిదేళ్ల కాలంలో చేతివృత్తులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న బీసీ వర్గాలకు ఒక్క స్వయం ఉపాధి యూనిట్‌ కూడా మంజూరు చేయలేదు. బీసీ యువతకు ఒక్క రాయితీ రుణం మంజూరు చేయలేదు. ఎన్నికల వేళ మళ్లీ నా బీసీలు ఉంటూ సీఎం జగన్‌ ఊదరగొడుతున్నారు. బీసీలను అట్టడుగుకు నెట్టేసిన జగన్‌ను మళ్లీ నమ్మే పరిస్థితి లేదని బీసీలు తేల్చి చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో రూ.237 కోట్ల లబ్ధి..

గత తెదేపా ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు, ఫెడరేషన్‌ గ్రూప్‌లు, అత్యంత వెనుకబడి వర్గాలకు రుణాలతో పాటు ఆదరణ పథకం ద్వారా పరికరాల పంపిణీకి రూ.237 కోట్లు ఖర్చు చేశారు. బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం ఉపాధి రుణం కింద రూ.2 లక్షల యూనిట్లు మంజూరు చేశారు. దీనిలో గరిష్ఠంగా రూ.లక్ష రాయితీ ఇచ్చారు. జిల్లాలో 12 బీసీ ఫెడరేషన్లు ఉండగా, ఒక్కో ఫెడరేషన్‌లో 11 నుంచి 17 మంది సభ్యులు ఉండేవారు. వీరిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల రుణం ఇచ్చారు. దీనిలో రూ.లక్ష రాయితీ కల్పించారు. ఇలా పెద్ద ఎత్తున అయిదేళ్ల తెదేపా పాలనలో బీసీ వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు కల్పించి జీవన ప్రమాణాలను మెరుగుపర్చారు.

కేంద్ర పథకాన్ని ఆపేశారు..

కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాలు(ఎంబీసీ)కు 90 శాతం రాయితీలో గరిష్ఠంగా రూ.30వేల వరకు రుణం మంజూరు చేస్తుంది. దీనిలో పది శాతం బ్యాంకు రుణం కల్పిస్తారు. మిగతా 90 శాతం రాయితీ కల్పిస్తారు. ఎంబీసీ పథకాన్ని తెదేపా హయాంలో పటిష్ఠంగా అమలు చేశారు. జగన్‌ సర్కార్‌లో గత అయిదేళ్లు ఈ పథకం జోలికి వెళ్లలేదు. ఒక్కరికీ స్వయం ఉపాధి రుణం మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు ముందుకు వచ్చినా.. జగన్‌ సర్కార్‌ ఆసక్తి చూపలేదు.

అటకెక్కిన ఆదరణ పథకం

బీసీ వర్గాల్లో చేతి వృత్తుల వారికి గత తెదేపా హయాంలో ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో ఆదర్శంగా అమలు చేసింది. రూ.3వేల నుంచి రూ.30వేల విలువైన వివిధ పనిముట్లను ఉచితంగా బీసీ వర్గాలకు అందజేశారు. 2014-19 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.26కోట్ల విలువైన పనిముట్లు అందజేశారు. వైకాపా సర్కార్‌ వచ్చాక గత అయిదేళ్లు ఈ పథకాన్నీ ఆపేసింది. దీంతో చేతి వృత్తులు చేస్తున్న బీసీలు ఎంతో నష్టపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని