logo

జనగళం జయభేరి

మూడు పార్టీల జట్టు.. సమర భేరి మోగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ప్రజాగళం సభకు కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు జన సైనికులు..

Published : 07 May 2024 05:07 IST

కూటమి సభకు తరలివచ్చిన శ్రేణులు
న్యూస్‌టుడే రాజమహేంద్రవరం

నా యాత్ర దేశం కోసం.. ధర్మం కోసం..

మూడు పార్టీల జట్టు.. సమర భేరి మోగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ప్రజాగళం సభకు కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు జన సైనికులు.. ఎటుచూసినా జనం జయభేరి మోగించారు. ప్రధాని మోదీ.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు తమ ప్రసంగాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో రెట్టింపు సంక్షేమం సాధ్యమని వివరించారు. అభివృద్ధిలో జీరో.. అవినీతి వంద శాతం అంటూ వైకాపా పాలన తీరును ఎండగట్టారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నర్సాపురం పార్లమెంట్‌ స్థానాల పరిధి నుంచి  పెద్దఎత్తున జనం తరలివచ్చారు.

వందనం.. అభివందనం: ప్రధానికి నమస్కరిస్తున్న కూటమి అభ్యర్థులు


అభివృద్ధి కావాలా? విధ్వంసమా?
- ఆదిరెడ్డి శ్రీనివాస్‌, రాజమహేంద్రవరం నగర అభ్యర్థి

వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. యువతకు ఉద్యోగాలు లేవు. రైతులకు ఆసరా లేదు. ఈ ఎన్నికల్లో మన నినాదం ఒక్కటే ఏపీలో అభివృద్ధి కావాలా? విధ్వంసమా? రాజమహేంద్రవరం చారిత్రాత్మక నగరం. మనపై నమ్మకంతో పురందేశ్వరిని రాజమహేంద్రవరానికి ఇచ్చారంటే మనపై చాలా బాధ్యత ఉంది.


ఆంధ్రను అప్పులపాల్జేశారు
- ముప్పిడి  వెంకటేశ్వరరావు, కొవ్వూరు అభ్యర్థి

వైకాపా పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కల్పించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. కులాలు, మతాల మధ్య కలహాలకు కారణమైన జగన్‌.. మళ్లీ సీఎం అయితే ప్రజలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి.


త్రిమూర్తుల్లా జత కట్టారు
- బత్తుల బలరామకృష్ణ, రాజానగరం అభ్యర్థి

త్రిమూర్తుల మాదిరి మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కూటమికి ప్రాణం పోశారు. పదేళ్లుగా మోదీ దేశానికి ఎనలేని సేవ చేశారు. మూడోసారి ప్రధాని కావడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రజల జీవితాలను వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తి జగన్‌. ఏపీలో అభివృద్ధి జరగాలంటే కూటమికి పట్టం కట్టాలి.


జగన్‌ జైలుకెళ్లడానికి సిద్ధం
- బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం గ్రామీణ అభ్యర్థి

జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమంటున్నారు.. దేనికో తెలుసా.. ఈ ఐదేళ్లలో ఏపీలో దోచుకున్న డబ్బుకు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లడానికి సిద్ధమంటున్నారు. రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి మీరూ సిద్ధమేనా..? అవినీతి, అరాచకం, అణచివేతతో దమనకాండతో ఐదేళ్లు వేధించిన జగన్‌కు మీ ఓటుతో బుద్ధిచెప్పండి.


మ్యానిఫెస్టో ప్రతి ఇంటికీ చేరాలి
- కందుల దుర్గేష్‌, నిడదవోలు అభ్యర్థి

దుర్మార్గపు, నియంతృత్వ వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి చేసే పోరాటంలో అంతా భాగస్వాములు కావాలి. పార్లమెంటుకు పురందేశ్వరిని తప్పక పంపించాలి. రాజకీయ, పదవీ కాంక్షతో కాదు.. ప్రజలకు సేవ చేయడానికే కూటమి అభ్యర్థులున్నాం. కూటమి మ్యానిఫెస్టో విశేషాలను ప్రతి ఇంటికీ తెలియజెప్పాలి.


రాక్షసుణ్ని సాగనంపాలి
- నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి అభ్యర్థి

రాష్ట్రంలో రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించడం కోసం.. రాక్షసుణ్ని ఇంటికి పంపించడం కోసం.. కూటమి కృషిచేస్తోంది. మూడు పార్టీల కలయిక పవిత్ర త్రివేణి సంగమంతో సమానమైంది. ఏపీలో అభివృద్ధి లేదు. అవినీతి రాజ్యమేలుతోంది. కూటమి అత్యధిక స్థానాలు సాధించే దిశగా దూసుకెళ్తుండడం శుభ పరిణామం.

ప్రధానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని పరిచయం చేస్తున్న లోకేశ్‌

సభలో లోకేశ్‌, పురందేశ్వరి చిరునవ్వులు

అచ్చంగా.. నమో మెచ్చంగా..

ప్లకార్డులతో భాజపా, తెదేపా శ్రేణుల సందడి

జన ప్రవాహం: సభకు తరలివచ్చిన ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని