logo

రూ.4.63 లక్షల ఉపాధి నిధులు దుర్వినియోగం

‘కొండను తవ్వి.. ఎలుకను పట్టినట్లు’గా ఉంది సామాజిక తనిఖీ వ్యవహారం. 2019- 20, 2020- 21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మాచవరం మండలంలో రూ.5.06 కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయగా..

Published : 15 Jan 2022 00:57 IST

మాచవరం, న్యూస్‌టుడే : ‘కొండను తవ్వి.. ఎలుకను పట్టినట్లు’గా ఉంది సామాజిక తనిఖీ వ్యవహారం. 2019- 20, 2020- 21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మాచవరం మండలంలో రూ.5.06 కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయగా.. అందులో రూ.4.63 లక్షలు దుర్వినియోగం అయ్యాయని అధికారులు తేల్చారు. సమావేశంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ ఏమైనా తప్పులుంటే మన్నించాలని కోరారు. దీంతో విచారణ అధికారులు కొన్నింటిని చూసినా, చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద గురువారం రాత్రి స్థానిక మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జరిగిన ‘ప్రజా వేదిక’ విచారణను అందరూ మమ అనిపించారు. మస్టర్లలో కొట్టివేతలు, సిమెంట్‌ రహదారుల పనుల్లో వ్యత్యాసాలు, పొలాల్లో నాటిన మొక్కలు తగ్గటం, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు రికార్డులు చూపకపోవడం వంటి కారణాలతో అధికారులు రూ.4.63 లక్షలను ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి రికవరీ విధించారు. అలాగే వేమవరం అటవీ సెక్షన్‌లో చేపట్టిన రూ.6.17 లక్షల పనులకు రికార్డులు చూపకపోవడంతో ఆ శాఖ అధికారులకు మేజర్‌ జరిమానా విధించారు. నిర్ణీత గడువులోగా వ్యక్తిగతంగా హాజరై వివరాలు సమర్పించాలని, లేకుంటే రికవరీ విధిస్తామని విచారణ అధికారులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని