logo

రాయితీలకు మంగళం

పశు పోషణకు గ్రాసం భారంగా మారింది. రబీ కింద సాగు చేసిన పంటలు ప్రస్తుతం చేతికొస్తున్నాయి. వీటిలో వరి నుంచే గ్రాసం అత్యధికంగా వస్తుంది. శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి, వినుకొండ మండలం,....

Published : 23 May 2022 05:11 IST

పాడి పరిశ్రమకు అందని ప్రభుత్వ ప్రోత్సాహకాలు

గ్రాసం ధర పెరిగి.. పశు పోషకుల ఇబ్బందులు

వినుకొండ, శావల్యాపురం, న్యూస్‌టుడే


పశుగ్రాసాన్ని తరలిస్తున్న రైతులు

పశు పోషణకు గ్రాసం భారంగా మారింది. రబీ కింద సాగు చేసిన పంటలు ప్రస్తుతం చేతికొస్తున్నాయి. వీటిలో వరి నుంచే గ్రాసం అత్యధికంగా వస్తుంది. శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి, వినుకొండ మండలం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, తదితర మండలాలకు చెందిన పశు పోషకులు గ్రాసాన్ని అధిక ధరలకు కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఎత్తివేయడంతో నేడు పోషకులే పూర్తి మొత్తం భరించాల్సి వస్తోంది.

వేసవి రాగానే.....

వేసవి రాగానే గ్రాసం ధరలకు రెక్కలొస్తున్నాయి. పంట పొలాల వద్దకే రైతులు వెళ్లి పొలం విస్తీర్ణం బట్టి గ్రాసం ధర ఖరారు చేసుకుని కొంటున్నారు. ఎకరం పొలంలోని వరి గడ్డి రూ.10 వేల వరకు ధర పలుకుతోంది. అదే ధరకు రైతులు కొంటున్నారు. దీనికి తోడు ఎండు గడ్డిని ఇంటి వద్దకు సరఫరా చేసేందుకు రూ.2 వేలు వ్యయం అవుతుంది. జిల్లాల్లో పశు సంపదను కాపాడుకునేందుకు గతంలో ప్రభుత్వం రాయితీపై గ్రాసం, దాణా, ఇతర ఆహార పదార్థాలను అందించేది. మూడేళ్లుగా ఆ పథకాలు అమలు కావడం లేదు. దీంతో రైతులే పశుగ్రాసం కొని పశువులను పోషించుకుంటున్నారు. గతంలో 50 రాయితీపై దాణా సరఫరా చేసే వారు. సైలేజ్‌ గడ్డి, కరవు దాణా రాయితీపై ప్రభుత్వం పాడి పోషకులకు అవసరమైన మేరకు సరఫరా చేస్తుండేది. ఈ గ్రాసం పోషక విలువలతో కూడినది కావడంతో పాడి రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది.

పాడిపోషకులకు ఇబ్బంది రానీయం

ప్రభుత్వం దాణా సరఫరాకు సంబంధించి ఇంకాను బడ్జెట్‌ కేటాయించలేదు. కేటాయించగానే రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై దాణా అందజేస్తాం. ఇప్పటికే పశుగ్రాసం కత్తిరించే యంత్ర పరికరాలు, టీఎంఆర్‌ దాణా అందజేస్తున్నాం. బడ్జెట్‌ కేటాయింపులు రాగానే పశు పోషకులకు 50 శాతం రాయితీపై దాణాను రైతులకు అందుబాటులోకి తీసువస్తాం. పోషకులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. - సాంబశివరావు డీడీ నరసరావుపేట

అన్నీ పెరిగాయ్‌

ఉమ్మడి గుంటూరు జిలాల్లో నుంచి రోజుకు 3.50 లక్షల లీటర్ల పాలు సేకరణ చేస్తారు. వీటిలో వినుకొండ డివిజన్‌లో అత్యధికంగా 75 వేల లీటర్లు వస్తుండటం విశేషం. మిక్సెడ్‌ దాణా 50 కిలోల బస్తా రూ.1200 ఉండగా, ఇటీవల బస్తాపై రూ.200 ధర పెరిగింది. తవుడు 50 కిలోలు రూ.1000 ఉండగా, గత నెల రోజుల్లో రూ.1400కు పెరిగింది. పశువుల దాణా బస్తాపై రూ.100 పెరగడంతో కొనలేని పరిస్థితి ఉందని, రాయితీపై అందించాలని శావల్యాపురానికి చెందిన దుర్గ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని