logo

అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన

సీఎం జగన్‌ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.

Updated : 30 Apr 2024 07:12 IST

మెగా డీఎస్సీ పేరుతో ఆటలు
శిక్షణ తీసుకున్న అభ్యర్థులు కుదేలు
ఇన్నాళ్లూ నిద్రపోయావా జగన్‌?
ఈనాడు, అమరావతి

రాష్ట్రంలో 25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటినీ భర్తీ చేస్తాం. ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి లేకుండా చేస్తాం. ప్రతి బడిలో కనీసం ఇద్దరు టీచర్లు ఉండేలా చూస్తాం.

ఎన్నికలకు ముందు విపక్ష నాయకుడి హోదాలో జగన్‌ చెప్పిన మాటిది.


  • గుంటూరు సుగాలీకాలనీకి చెందిన బాణావత్‌ లక్ష్మి 25వేల టీచర్‌ పోస్టులు జగన్‌ భర్తీ చేస్తారని ఆశతో అవనిగడ్డ వెళ్లి మరీ శిక్షణ తీసుకుంది. నెలకు అక్కడ ఇంటి అద్దె, శిక్షణ రుసుం లెక్కిస్తే రూ.60వేలు ఖర్చయింది. అయిదేళ్లలో నోటిఫికేషన్‌ రాకపోవడంతో చదివిందంతా వృథా అయిందని ఆమె ఆవేదన చెందుతున్నారు.

  • తెనాలికి చెందిన సాయిశ్రీ గుంటూరు నగరంలోని బీఎడ్‌ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేసుకుంది. ఆమె మూడేళ్ల నుంచి ఉపాధ్యాయ కొలువుపై ఆశతో ఉంది. గుంటూరు బ్రాడీపేటలో ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంది. సరిగ్గా ఎన్నికల ముంగిట సమయం ఏమాత్రం ఇవ్వకుండా ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించడం, దానికి ఈసీ బ్రేకులు వేయడంతో ఆ విద్యార్థిని మూడేళ్ల నుంచి సుమారు రూ.2లక్షలు ఖర్చు పెట్టి చదివినా ప్రయోజనం లేకుండా పోయింది.

  • పొన్నూరుకు చెందిన వేమూరి శ్రీకాంత్‌ నాలుగేళ్ల కిందటే బీఎడ్‌ చేశారు. జగన్‌ సర్కారు టీచర్ల నియామకాలు చేపడుతుందని బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరి ఏడాదికి వసతిగృహ ఫీజులతో కలిపి రూ.50వేల చొప్పున రూ.లక్ష చేతి చమురు వదిలించుకున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తనకు ఇప్పుడు రూ.లక్ష అప్పు నెత్తిన కుంపటిలా మారిందని ఆవేదన చెందుతున్నారు.

సీఎం జగన్‌ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. పైపెచ్చు పాఠశాలల విలీనం పేరుతో టీచర్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు తీసుకెళ్లారు. వారిపై విపరీతమైన పనిభారం మోపారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఇద్దరు టీచర్లను నియమించింది లేదు. ఇప్పటికీ ఉమ్మడి గుంటూరులో పలుచోట్ల ఒక టీచర్‌ మాత్రమే ఉన్నారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. టీచర్లపై పెట్టే ఖర్చు తగ్గించుకోవాలని ఏకంగా పోస్టుల నియామకాలకు స్వస్తి పలికింది. అధికారంలోకి వచ్చిన అయిదేళ్లకు నిరుద్యోగుల ఓట్లు గుర్తొచ్చి హడావుడి నోటిఫికేషన్‌కు తెరతీసింది. ఈసీ అభ్యంతరం తెలుపుతుందని తెలిసి కూడా  నిరుద్యోగులతో ఆడుకుంది.

విలీనంతో పోస్టులు తగ్గిపోయి

పాఠశాలల విలీనంతో చాలావరకు పోస్టుల్లో కోతపడ్డాయి. గతంలో 20-30 మంది పిల్లలు ఉన్నా ఇద్దరు, ముగ్గురు టీచర్లు ఉండేవారు. విలీనంతో ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. 30 మంది లోపు అయితే ఒకరితోనే సరిపుచ్చారు. విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత టీచర్ల ఖాళీలకు నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో చాలా మంది తిరిగి ఏదో కొలువుల్లో చేరిపోయారు. ఏటా సంక్రాంతి నాడు జాబ్‌ క్యాలెండర్‌ అని ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పడంతో ప్రభుత్వ కొలువే ధ్యేయంగా వ్యయ, ప్రయాసలకోర్చి అహోరాత్రులు కష్టపడి చదివిన నిరుద్యోగులకు ప్రయోజనం లేకుండా పోయింది.

ఏటా 10వేల మంది

ఉమ్మడి గుంటూరులో 60 బీఎడ్‌, మరో 50 వరకు డీఎడ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఏటా 10 వేల మంది ఉపాధ్యాయ విద్య శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. అయిదేళ్లలో 50వేల మంది వరకు శిక్షణ పూర్తి చేసుకుని డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూశారు. తీరా పదవీ కాలం పూర్తయ్యేటప్పుడు జగన్‌ సర్కార్‌కు డీఎస్సీ  ప్రకటన అంశం గుర్తుకురావడం గమనార్హం. ఫలితంగా 50వేల మంది ఉపాధ్యాయ శిక్షణార్థుల ఆశలపై జగన్‌ సర్కారు నీళ్లు చల్లినట్లయింది. గుంటూరు, చెరుకుపల్లి, అవనిగడ్డలో కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి మరీ శిక్షణ పొందారు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో బతుకుదెరువు కోసం ఏదో ఒక కొలువులో చేరి చాలీచాలని జీతాలతో బతుకీడుస్తున్నారు. కొందరేమో అత్తెసరు జీతాలకు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నారు. కరోనా కాలంలో ఉపాధి లేక వారు కూరగాయలు సైతం విక్రయించారు.గతంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ తరచూ ఇచ్చేవారు. దీంతో చాలా మంది ఉపాధ్యాయ శిక్షణకు ఆసక్తితో వచ్చేవారు.

డైట్‌ అధ్యాపకుల పోస్టులూ భర్తీ చేయలేదు

ఉమ్మడి గుంటూరులో ఒకప్పుడు 20-30 బీఎడ్‌, డీఎడ్‌ కళాశాలలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం బీఈడీ, డీఈడీ కలిసి వందకు పైగా కళాశాలలు ఉన్నాయి. జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో డైట్‌ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయలేదు. ఈ పోస్టులకు ఎంఈడీ చేసిన వారు అర్హులు. ప్రతి పోస్టు ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులతో భర్తీ చేసి టీచర్ల నియామకాలను నిర్వీర్యం చేసిందన్న అపవాదును జగన్‌ ప్రభుత్వం మూటగట్టుకుంది. చివరకు డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీ చేపట్టలేదు. పదవీ విరమణ, వీఆర్‌ఎస్‌, చనిపోయిన వారితో ఏర్పడిన ఖాళీలు కలిపితే ఉమ్మడి గుంటూరులో 3వేలకు పైగా ఉంటాయని అంచనా.  


రాగానే పోస్టులు భర్తీ చేస్తారని

చాలా మంది టీచర్‌ పోస్టులపై ఆశతో చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు మానేసి మరీ డీఎస్సీ శిక్షణకు వెళ్లారు. కరోనా అడ్డొచ్చిందని ఒకసారి.. పాఠశాలల విలీన ప్రక్రియ పేరుతో మరోసారి జగన్‌ వాయిదా వేసుకుంటూ వచ్చారు. జిల్లాల వారీగా ఖాళీలు గుర్తించి వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటామని నిరుద్యోగుల్లో ఆశలు రేపారు. అయిదేళ్లయినా కొలువులు రాకపోవడంతో జగన్‌ ద్రోహం చేశారని వారు మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని