logo

‘మోసానికి’ బ్రాండ్‌ అంబాసిడర్‌

మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్‌ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో ఐదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు.

Updated : 05 May 2024 06:27 IST

రాజధాని రైతులకిచ్చిన ప్లాట్ల అభివృద్ధిని తొక్కేసిన సర్కారు
అడవిలా మారిన స్థలాలు
నైరాశ్యంలో అన్నదాతలు 
కోర్టులో ప్రమాణపత్రం ఇచ్చాక.. పనుల నిలిపివేత
ఈనాడు - అమరావతి,  న్యూస్‌టుడే - తుళ్లూరు

మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్‌ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో ఐదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు. కొన్ని ప్రాంతాల్లో తూతూమంత్రంగా జంగిల్‌ క్లియరెన్స్‌ చేసి.. తర్వాత ఆ పనులనూ ఆపేసింది. జగన్‌ సర్కారు కక్ష సాధింపు చర్యల కారణంగానే రైతుల ప్లాట్లు అడవిని తలపిస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇక్కడ అభివృద్ధికి నిధులు వెచ్చించడం ఇష్టం లేకే నాటకాలాడుతోందని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మూణ్నాళ్ల ముచ్చటగా పనులు

రాజధాని కోసం గత ప్రభుత్వం 34 వేల ఎకరాలను భూసమీకరణ విధానంలో తీసుకుంది. ఇందుకుగాను రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఇవ్వాలన్నది ఒప్పందం. ఇలా కేటాయించిన మొత్తం ప్లాట్లు 64,735. తెదేపా ప్రభుత్వ హయాంలో రైతుల పేర్లతో సుమారు 40 వేలకుపైగానే ప్లాట్లను రిజిస్టర్‌ చేసింది. జగన్‌ సర్కారు వచ్చాక ఈ ప్రక్రియను నిలిపేయడంతో రైతులు హైకోర్టుకెళ్లారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. రైతులకు అన్ని వసతులతో ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని రెండేళ్ల క్రితం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. సీఆర్డీఏ 13 జోన్లలో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 16,400 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచింది. 11 జోన్లకు ఖరారు చేసి గుత్తేదారులను ఎంపిక చేసింది. ప్లాట్లలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కోసం 2022 జులైలో పనులు ప్రారంభించారు. కొన్నాళ్లు కంపచెట్లు తొలగించిన అనంతరం సీఆర్డీఏ మొత్తం పనులను నిలిపేసింది.

తుళ్లూరులో రైతులకు ఇచ్చిన నివాస ప్లాట్ల దుస్థితి

ఎవరి ప్లాట్‌ ఎక్కడో..?

రైతుల ప్లాట్లలో రూ. 16,400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. దీనికి సాక్ష్యంగా పలు చిత్రాలను జత చేసింది. తిరిగి ఏడాదిన్నర క్రితమే సీఆర్డీఏ అధికారులు ఆ పనులను నిలిపేశారు. అప్పట్నుంచి ఈనాటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. జంగిల్‌ క్లియరెన్స్‌ చేసిన ప్రాంతంలో ముళ్లకంపలు దట్టంగా పెరిగిపోయాయి. పనుల కోసం రూ. 3,500 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నట్టు చెప్పి.. ఆ తరువాత మిన్నకుండిపోయింది. దీంతో బ్యాంకర్లు ముందుకు రాలేదు. విశాఖకు పరిపాలనను మార్చాలన్న తలంపుతో ఉన్న జగన్‌.. అమరావతిని కావాలనే నిర్లక్ష్యం చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమ్ముదామంటే.. కొనేవారేరీ..?

అవసరాల కోసం ప్లాటు అమ్ముకుందామన్నా కొనేవారు రావటం లేదు. పిల్లల చదువులు, వివాహాలు, ఆరోగ్య అవసరాల కోసం అప్పులు చేస్తూ రాజధాని రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం సీఆర్డీఏ అట్టహాసంగా జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టిన దొండపాడు, పిచ్చికులపాలెం, అనంతవరం, తుళ్లూరు గ్రామాల సమీపంలో ముళ్ల చెట్లు పెరిగిపోయాయి. ఆ ప్లాట్లలోకి అడుగు పెడదామన్నా వీలు కాని పరిస్థితి. కనుచూపు మేర అడవిలా విస్తరించింది. దీనికితోడు ఎవరి ప్లాట్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితి. హద్దులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. జగన్‌ ప్రభుత్వ తీరు రైతులకు శాపంలా మారింది.


నా స్థలానికి వెళ్లేందుకు దారి లేదు

- చంద్రశేఖర్‌, రైతు, దొండపాడు

రాజధాని నిర్మాణానికి 4.5 ఎకరాలిచ్చా. గత ప్రభుత్వం లాటరీ విధానంలో నాకు ప్లాట్లు కేటాయించింది. జగన్‌ వచ్చాక.. రాజధాని భూములన్నీ ముళ్లకంప చెట్లతో అడవిలా మారిపోయాయి. నా ప్లాటు ఎక్కడుందో తెలియని పరిస్థితి. అక్కడకు వెళ్లేందుకు కనీసం దారి కూడా లేదు. అమ్మేద్దామనుకున్నా.. కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నా.


అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నా..

- వీరయ్య, రైతు, ఐనవోలు

చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో భూసమీకరణలో నేను 3.5 ఎకరాలిచ్చా. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులంటూ అమరావతిని అటకెక్కించింది. మా ప్లాట్లలో ఎటు చూసినా కంపచెట్లే కనిపిస్తున్నాయి. నాకు ఇద్దరమ్మాయిలు. వాళ్ల ఇంజినీరింగ్‌ చదువుల కోసం ప్లాటు అమ్ముదామనుకున్నా రేట్లు పడిపోయాయి. చేసేది లేక అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని