logo

‘జలకళ’లో జగన్‌ దగా

రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్‌పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం.

Published : 05 May 2024 05:57 IST

బోర్ల పేరుతో రైతులకు మోసం
మోటార్లు, విద్యుత్తు కనెక్షన్లు లేక నిరుపయోగం
న్యూస్‌టుడే, వినుకొండ, వినుకొండ గ్రామీణ

రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్‌పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు మాత్రం బోర్లతో పాటు మోటార్లు కూడా బిగిస్తున్నాం. -2020 సెప్టెంబరు 28న వైఎస్‌ఆర్‌ జలకళ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ చెప్పిన మాటలివి.

సీఎం మాటలు ఆచరణలో ఉత్తమాటలేనని తేలాయి. పథకంలో నమోదు చేసుకున్న అందరికీ బోర్లు వేయలేదు. వేసిన చోట మోటార్లు ఇవ్వలేదు. కరెంట్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయకుండా కాలం వెళ్లబుచ్చారు. నూజండ్ల మండలం ముక్కెళ్లపాడుకు చెందిన సన్నకారు రైతు శివాజి హనుమంతరావు పొలంలో వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కింద బోరు వేసి మూడేళ్లయింది. మోటారు, విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా మారింది. పల్నాడు జిల్లాలో జలకళ లబ్ధిదారులందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు పదిశాతానికి మించి బోర్లు పనిచేయడం లేదంటే పథకం అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసు కోవచ్చు.

మంజూరు ఇలా..

చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని, బీడు భూములను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. 2020 సెప్టెంబరు 28న సీఎం జగన్‌ అట్టహాసంగా ప్రారంభించారు. అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు ద్వారా  సాగు నీరందించడమే లక్ష్యమని చెప్పారు. గ్రామ వాలంటీర్ల ద్వారా సచివాలయాల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను వీఆర్వో పరిశీలించి డ్వామా ఏపీడీకి పంపిస్తారు. అక్కడి నుంచి భూగర్భ జల సర్వే కోసం జియాలజిస్టులకు చేరతాయి. నీటి లభ్యత ఉన్న వాటికి ఏపీడీ పరిపాలనా అనుమతి ఇస్తారు. తదుపరి బోరు వేసి మోటారుతోపాటు విద్యుత్తు కనెక్షన్‌ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పైసా ఖర్చు లేకుండా రైతుల భూములకు జలకళ తీసుకొస్తామని చెప్పారు.

నూజండ్లలో అంజయ్య పొలంలో నిరుపయోగంగా ఉన్న బోరు

దరఖాస్తులు 10వేలు.. విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చింది 116

పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రైతుల నుంచి 10389 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత గ్రౌండ్‌ వాటర్‌ సర్వే విభాగం గుర్తించిన వాటిల్లో 3580 బోర్లకు అనుమతించారు. అందులో 1032 చోట్ల డ్రిల్లింగ్‌ పూర్తి చేశారు. ఇందులో మాచర్ల నియోజకవర్గంలో 594, వినుకొండ నియోజకవర్గంలో 200 ఉన్నాయి. గురజాల వంటి చోట్ల ఒక్కటీ లేదు. విద్యుత్తు కనెక్షన్లకు 818 బోర్లకు ప్రతిపాదన పంపితే విద్యుత్తుశాఖ 238కి మాత్రమే అనుమతించి జులై నాటికి కేవలం 116 మాత్రమే స్తంభాలు, లైన్‌లు పూర్తి చేశారు. వాటికి ప్రభుత్వం మోటార్లు ఇవ్వనందున అమర్చిన విద్యుత్తు పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. కొంతమంది రైతులు మాత్రం సొంత ఖర్చుతో పంప్‌సెట్‌లు అమర్చి వినియోగిస్తుండగా మరికొందరు అంత పెట్టుబడి పెట్టలేక బోర్లు ఖాళీగా వదిలేశారు. రిగ్‌ యజమానులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో బోర్ల డ్రిల్లింగ్‌ చాలాకాలం క్రితమే ఆపేశారు.

ఉచిత బోర్లకు అందిన దరఖాస్తులు: 10168
నీరు పడిన బోర్లు : 974
విద్యుత్తు కనెక్షన్లు ఉన్నవి 116


కనెక్షన్‌ ఇవ్వలేదు

పొలంలో బోరు వేసి ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్‌, మోటారు ఇవ్వలేదు. అధికా రులను అడిగితే రాలేదని సమా ధానం చెబుతున్నారు. సొంతంగా చేసుకోవాలంటే రూ.లక్ష ఖర్చు అవుతుంది. సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్నందున కనెక్షన్‌ ఇస్తే బోరును వినియోగించుకుంటా.

రాగిపూడి అంజయ్య, నూజండ్ల


బోరు వేసి మోటారు ఇవ్వలేదు

జలకళ పథకం కింద పొలంలో బోరు వేసి ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్‌, మోటారు ఇవ్వలేదు. దీంతో బోరు నిరుపయోగంగా మారింది. నాలాగే చాలామందికి బోరు వేసి వదిలేశారు. అందరం విద్యుత్తు కనెక్షన్‌, మోటార్ల కోసం ఎదురు చూస్తున్నాం.

చిన్న భాస్కరరావు, అల్లిబాయిపాలెం, నూజండ్ల మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని