logo

ఏళ్లుగా సడలని సంకల్పం

మొక్కవోని దీక్ష, పట్టుదలతో అమరావతిని కాపాడుకోవడం కోసం అన్నదాతలు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 1600 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా పంటిబిగువున ఎత్తిన చెయ్యి దించకుండా ప్రతి దశలోనూ మహిళలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Published : 05 May 2024 06:00 IST

1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాజధాని గ్రామాల్లో ప్రత్యేక నిరసనలు
తుళ్లూరు, న్యూస్‌టుడే

అనంతవరంలో పోలేరమ్మ ఆలయం వద్ద నినాదాలు 

మొక్కవోని దీక్ష, పట్టుదలతో అమరావతిని కాపాడుకోవడం కోసం అన్నదాతలు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 1600 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా పంటిబిగువున ఎత్తిన చెయ్యి దించకుండా ప్రతి దశలోనూ మహిళలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పోలీసులు బూటు కాళ్లతో పొత్తి కడుపులో తన్నినా, ముళ్లకంచెలు వేసి నిలువరించినా పోరుబాటలో వెనుకంజ వేయలేదు. కరోనా కమ్మేసినా.. ఎన్నికల కోడ్‌ వచ్చినా అమరావతే మా ఎజెండా అంటూ రాజధాని ఐకాస జెండాను భుజంపై నుంచి దించలేదు. అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని నిలువరించడానికి వైకాపా అధినేత జగన్‌ ఉద్యమకారులను ముప్పుతిప్పలు పెట్టారు. అయినప్పటికీ దేశంలో ఎక్కాడా లేని విధంగా అమరావతి కోసం అన్నదాతలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. వైకాపా అరాచక ప్రభుత్వం దిగిపోయి తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపొందినప్పుడే అమరావతికి విముక్తి లభిస్తుందని భావిస్తున్నారు. ఉద్యమం 1600 రోజుకు చేరుకున్న సందర్భంగా వెంకటపాలెం, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతవరంలోని గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో అఖండ దీపం వెలిగించి రైతులు, రైతుకూలీలు, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం గెలుపొంది అమరావతి రూపకర్త చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని కోరుకున్నారు.

గ్రామదేవత వద్ద పూజలు


రైతు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే

అమరావతి ఉద్యమంలో 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అమరావతి కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నాం. మా త్యాగాలను గుర్తించడం లేదు. రైతుల మరణాలన్నీ ప్రభుత్వ చేసిన హత్యలుగానే భావిస్తున్నాం. వైకాపా కనుమరుగైపోతేనే అమరావతికి విముక్తి లభిస్తుంది.

వరలక్ష్మి, మందడం


ఒక్క అవకాశం ఇచ్చి మోసపోయాం

1600 రోజులుగా ఇళ్లు, వాకిళ్లు వదిలేసి అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నా సీఎం జగన్‌ స్పందించలేదు. రూ.10వేల కోట్ల ప్రజాధనంతో ప్రారంభించిన అమరావతిని నిర్వీర్యం చేయడం దారుణం. అభివృద్ధి చేస్తాడని నమ్మి జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే మేమే మోసపోయాం.

అనుమోలు సునీత, లింగాయపాలెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని