logo

గుండెలదిరేలా గ్రామాల రోడ్లు

Published : 05 May 2024 06:07 IST

పల్లెల మధ్య రహదారులు అధ్వానం
అయిదేళ్లలో నిర్వహణకు నిధులివ్వని జగన్‌
ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, రొంపిచర్ల, చిలకలూరిపేట గ్రామీణ

అధ్వానంగా వినుకొండ- పానకాలపాలెం దారి

గ్రామాల నుంచి గ్రామాలకు అనుసంధానం చేసే పల్లెదారులు...  పల్లెల నుంచి మండల కేంద్రాలకు రాకపోకలు సాగించే రహదారులను అయిదేళ్ల వైకాపా పాలనలో పట్టించుకోకపోవడంతో నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. పల్లెలను అనుసంధానం చేసే కొత్త రహదారులు వేయకపోగా పాత వాటిని కూడా అభివృద్ధి చేయకపోవడంతో పల్లెవాసుల పాట్లు వర్ణనాతీతం. కేంద్రం నుంచి వంద శాతం గ్రాంటుతో వచ్చే నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చకపోవడం, కేంద్రం ద్వారా వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వక పనులు నిలిచిపోయాయి. తుపానులు, భారీవర్షాలకు వాగులు ఉప్పొంగి అనుసంధాన రహదారులు కోతకు గురైనా పట్టించుకునేవారు కరవయ్యారు. జగన్‌ నోరు తెరిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఊదరగొడుతుంటారు. వీరంతా ఎక్కువగా నివసించే పల్లెల్లో రహదారులు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాని నిధులు

ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ఆర్థిక సాయంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీ రాజ్‌ రోడ్లను కొన్నింటిని ఎంపికచేసి ఒక ప్యాకేజీ కింద తీసుకుని అభివృధ్ధి చేస్తున్నారు. ఇందులో 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటుగా సమకూర్చాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించి విడుదల చేయాలి. అయితే రాష్ట్రప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. బాపట్ల జిల్లాలో రూ.77 కోట్లతో 30 రోడ్ల పనులు చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు అర్ధంతరంగా పనులు ఆపేశారు. న్యాయస్థానానికి వెళ్లి బిల్లులు తెచ్చుకున్న గుత్తేదారు మిగిలిన పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.

అందని నిధులు : ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో మార్కెట్‌ కమిటీల నుంచి నిధులు తీసుకుని ఆయా కమిటీల పరిధిలో పంచాయతీరాజ్‌ రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు సైతం పిలిచారు. పల్నాడు జిల్లాలో కొన్ని పనులు కూడా ప్రారంభించారు. ఈ దశలో మార్కెటింగ్‌శాఖ యార్డుల నిర్వహణ, ఇతర అవసరాలకు సొమ్ము లేక ఇబ్బందులు పడుతుంటే తాము రహదారుల అభివృద్ధికి నిధులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో పిలిచిన టెండర్లు రద్దుచేయగా ఒప్పందాలు చేసుకున్న గుత్తేదారులు పనులు చేయలేదు.  

పల్లెదారులు.. పడరాని పాట్లు

ప్రతి మండలంలో 30 నుంచి 35 వరకు పంచాయతీరాజ్‌ రోడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా 12 అడుగుల బీటీ, మెటల్‌, మట్టిరోడ్లతో కూడిన సింగిల్‌రోడ్లు. గ్రామంలో మాత్రం సిమెంట్‌ రహదారులు ఉంటాయి. వీటి నిర్వహణతోపాటు ఏటా కొన్ని రోడ్లు అభివృద్ధి చేసి ప్రయాణాలు సాఫీగా చూడాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు, ప్రధాన రహదారి నుంచి గ్రామాల్లోకి వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వైకాపా పాలనలో పట్టించుకోకపోవడంతో గోతులమయమై కొన్నిచోట్ల ఆటోలు కూడా వెళ్లలేని దుస్థితి. గ్రామీణులు ఎక్కువగా ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మిగ్‌జాం తుపాను, భారీవర్షాలకు వాగులు ఉప్పొంగి పల్లెదారులు కొన్నిచోట్ల కోతకు గురయ్యాయి. ఎక్కువగా మట్టిరోడ్లు కావడంతో వర్షాకాలంలో నీరు నిలిచినప్పుడు వాహనాల రాకపోకలతో గోతులు మరింత పెద్దవయ్యాయి. పల్నాడు జిల్లాలో వాగుల వల్ల కోతకు గురైన రహదారులు బాగు చేయకపోవడంతో పల్లెవాసులు చుట్టూ తిరిగి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. 

పల్నాడులో సుమారు రూ.85 కోట్లతో చేపట్టిన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద వందశాతం నిధులను కేంద్రం గ్రాంటుగా ఇస్తుండగా వాటిని మాత్రమే పూర్తిచేశారు. కేంద్రం పెట్టిన షరతులకు అనుగుణంగా కొన్ని రహదారులు అభివృద్ధి చేశారు. ఇవి మినహా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి రోడ్లు అభివృధ్ధి చేయలేదు.


రొంపిచర్ల మండలం సంతగుడిపాడు నుంచి కర్లకుంట గ్రామానికి వెళ్లే రహదారిని 2014లో నిర్మించారు. కాలక్రమంలో రోడ్డుపై కంకరరాళ్లు బయటపడ్డాయి. గుంతల్లో వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కర్లకుంట గ్రామానికి చెందిన 2,300 మంది ఇతర గ్రామాలకు రావాలన్న, విద్యార్థులు ఉన్నత చదువుకు వేరే గ్రామాలకు పోవాలన్నా ఈ రహదారే దిక్కు. ఇది అధ్వానంగా మారినా మరమ్మతులకు నోచుకోలేదు. గుంతలు పడిన మార్గంలో ప్రయాణిస్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడిన ఘటనలూ ఉన్నాయి.


చిలకలూరిపేట మండలం గొట్టిపాడు నుంచి గోరంట్లవారిపాలెం, ఈవూరివారిపాలెం, నాగభైరువారిపాలెం వెళ్లే రహదారి ఇది. 2కి.మీ. దూరం దారుణంగా ఉంది. ఈ రహదారిని సీసీ రహదారిగా నిర్మించాలని నాలుగు గ్రామాల ప్రజలు చేస్తున్న విజ్ఞప్తి  వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పట్టించుకోలేదు. వర్షంపడితే ఈ మార్గంలో నడవడానికి కూడా అవకాశం ఉండదు. చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. పంచాయతీరాజ్‌ అధికారులకు ప్రజలు మొరపెట్టుకున్న ప్రతిసారి ప్రతిపాదనలు పంపుతున్నాం. నిధులు వస్తాయంటూ మాటలతో కాలం వెళ్లదీశారు. గత డిసెంబరులో కురిసిన వర్షానికి ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని