logo

అంటకాగిన వారిపై వేటు

పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు చెప్పిందే వేదంగా అమలు చేసిన ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Updated : 09 May 2024 06:54 IST

మిగిలిన వారిలో మార్పు వస్తుందా?

పల్నాడులో పోలీసుల బదిలీపై చర్చ

 ఈనాడు, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు చెప్పిందే వేదంగా అమలు చేసిన ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మాచర్ల పట్టణ సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరిని తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా అధికారపార్టీ నేతలతో అంటకాగడంతో ఎన్నికల సంఘానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వరుస ఫిర్యాదులతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని ఈసీ సూచించింది. ఇది పల్నాడు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారపార్టీతో అంటకాగే పోలీసు అధికారుల్లో మార్పు వస్తుందా? స్వామిభక్తి నుంచి బయటపడి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా? అన్న విషయమై చర్చ జరుగుతోంది. జిల్లాలో అధికారపార్టీతో అంటకాగుతున్న పోలీసు అధికారులు పలువురు ఉన్నారు. ఎలాగైనా వైకాపాను గెలిపించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు.

  • జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంలో పనిచేస్తున్న డివిజన్‌స్థాయి పోలీసు అధికారి అధికారపార్టీ ఏం చెబితే అది అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలన్న ధోరణితో పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికార పార్టీకి అంటకాగుతూ ప్రతిపక్షాలు రోటీన్‌గా చేసుకునే వాటిని కూడా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా నాయకులు ఏంచేసినా ఇక్కడ చెల్లుబాటు అవుతుండగా ప్రతిపక్షాలు గీత దాటకముందే కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈవిషయాన్ని అనేక సందర్భాల్లో డివిజన్‌ స్థాయి పోలీసు అధికారి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పలు అక్రమ కేసులు నమోదు చేయించడంలో కీలకపాత్ర పోషించారు.  
  • పల్నాడు సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న ఒకపట్టణ సీఐ, ఎస్సై పూర్తిగా అధికార పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడం కోసం వీరిద్దరూ ఎంతకైనా దిగజారడం పోలీసు వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక ఎస్సై ప్రతిపక్షనేతలపై ప్రత్యేక నిఘా పెట్టి వారి కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా నేతల ఆదేశాలతో ఎక్కడిదాకా అయినా వెళ్తారన్న పేరుంది. ఇదే సబ్‌డివిజన్‌లో మరో పట్టణంలో ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ, ఎస్సై కూడా అధికారపార్టీతో అంటకాగుతున్నారు.
  • పల్నాడులో ఆర్థిక వ్యవహారాలకు కేంద్రంగా ఉన్న మండలంలో పనిచేస్తున్న ఎస్సై ఒకరు పరిధి దాటి ప్రవరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు అవసరమైన పనులు చేయడంతోపాటు సొంతజేబు నింపుకోవడంలో నిమగ్నమయ్యారు. ఎస్సై స్థాయిని కూడా మరిచి రెచ్చిపోతున్నారు. స్టేషన్‌కు వెళ్లే ప్రజలతో సదరు ఎస్సై ప్రవర్తించే తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో బతుకుతున్నామా? అన్న అనుమానం కలుగుతుందని వాపోతున్నారు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నా ప్రవర్తనలో మార్పు లేకపోవడం గమనార్హం.

ఇలాగైతే ప్రశాంత ఎన్నికలు ఎలా?

పల్నాడు జిల్లాలో అధికారపార్టీ నేతలు, వారి అనుచరులు ప్రతిపక్షాలపై దాడులు చేసినా బాధితులపైనే కేసులు పెట్టడం ఇక్కడి సంస్కృతి అన్న భావనకు ఇప్పటికైనా తెరదించాలి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమీపించిన తరుణంలో పల్లెల్లో రాజకీయ వేడి ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటినుంచి నిర్మాణాత్మకంగా, నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేయాల్సి ఉంది. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో సీఐ, ఎస్సై ఒకరు అధికారపార్టీ నేతలు చెప్పిందే చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారి మారిన జిల్లా పోలీసు కార్యాలయంలో కొన్ని విభాగాల్లో కొన్ని నెలల నుంచి పనిచేస్తున్న అధికారుల సాయంతో క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. పోలీసు యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం పరిధిలో ఉండటం, జరిగిన సంఘటనల ఆధారంగా నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు పారదర్శకంగా పనిచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి. వీరభక్తులుగా ఉన్న మరో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడితే మిగిలిన వారు ఎక్కడికక్కడ సర్దుకుంటారన్న భావన వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని