logo

‘సొంత చెల్లెలిపైనే జగన్‌ వ్యతిరేక పోస్టులు పెట్టించారు’

‘మద్య నిషేధం చేస్తాం, రాజధాని కడతాం, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేలు పింఛను ఇస్తాం,

Published : 09 May 2024 05:49 IST

నాదెండ్ల మనోహర్‌తో హైపర్‌ ఆది
తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ‘మద్య నిషేధం చేస్తాం, రాజధాని కడతాం, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేలు పింఛను ఇస్తాం, సీపీఎస్‌ రద్దు చేస్తాం, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం.. ఈ మాటలన్నీ చెప్పి ప్రజలను మోసం చేసిందెవరో మీకు తెలుసు, నేను వృత్తిపరంగా కమేడియన్‌ మాత్రమేనని వారి మాదిరిగా రియల్‌ కమెడియన్‌ కాదని జనసేన పార్టీ ప్రచారకర్త, సినీ,టీవీ నటుడు హైపర్‌ ఆది పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించానని తనపై వైకాపా సోషల్‌ మీడియా వారు రకరకాలుగా పోస్టింగ్‌లు పెట్టారని, ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయంలేదని.. ఎందుకంటే సీఎం జగన్‌ సొంత చెల్లెలు కాంగ్రెస్‌ పార్టీలో చేరితే వెంటనే ఆమెపై వ్యతిరేక పోస్టింగ్‌లు మొదలవటాన్ని మనమంతా చూశామన్నారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రశ్నించిన వారిపై దాడులు చేయటం, వేధించటం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించారని, మనం ఆయన పేరును మార్చి పిలవవచ్చని.. ఎందుకంటే అక్కడ బంపర్‌ మెజారిటీతో పవన్‌ గెలవబోతున్నారని పేర్కొన్నారు. ఈ మారు రాష్ట్రంలో కూటమిదే అధికారమని చెప్పారు. మా నాయకుడు పవన్‌కల్యాణ్‌కు చిరంజీవి ఎంతో, నాదెండ్ల మనోహర్‌ కూడా అంతేనని, అంతగా గౌరవిస్తారని చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్ర సభాపతిగా ఎందో హూందాగా ఆయన సభను నడిపారని, ఇటువంటి విజనరీ నాయకులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని వివరించారు. తాను విజయవాడ నుంచి తెనాలి వస్తూ ఆ రోడ్డును చూసి భయపడ్డానని, ఒక గర్భిణీ ఆటోలో వైద్యశాలకు ఈ మార్గంలో నుంచి వెళితే ప్రసవం అయిపోయేలా ఉందని వ్యాఖ్యానించారు. తొలుత హైపర్‌ ఆది మనోహర్‌ను కలిశారు. అనంతరం తెనాలి మండలంలోని గ్రామాల్లో మనోహర్‌ను గెలిపించాలని, గాజు గ్లాసుకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని