logo

లోకేశ్‌ను బిడ్డలా ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తారు

‘నారా లోకేశ్‌ను మీ బిడ్డలా ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తారు’ అని ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ ప్రజలను కోరారు.

Published : 09 May 2024 05:50 IST

ఈవీఎంపై ఓటు వేసే విధానం చూపుతున్న లోకేశ్‌ కుటుంబ సభ్యులు
తాడేపల్లి, న్యూస్‌టుడే: ‘నారా లోకేశ్‌ను మీ బిడ్డలా ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తారు’ అని ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ ప్రజలను కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పోలకంపాడులో నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం స్థానిక తెదేపా నేతలతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ‘సూపర్‌-6’ పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛన్‌, ప్రతి మహిళకు నెలకు రూ.1500 నగదు అందజేస్తారని వివరించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. వైకాపా పాలనలో యువత భవిష్యత్తు, మహిళల సాధికారత అటకెక్కిందని విమర్శించారు. 73 శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసి జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు. ఐదేళ్ల పాలనలో విధ్వంసం తప్పా అభివృద్ధి జాడ లేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా దొరకని నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్‌, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈవీఎం ప్యాడ్‌ నమూనా తీసుకుని వెళ్లి సైకిల్‌ గుర్తుకి ఎలా ఓటు వేయాలో వివరించారు. నమూనా బ్యాలట్‌ పత్రాలు పంపిణీ చేశారు. అధికారంలో లేకున్నా తన సొంత నిధులతో లోకేశ్‌ 29 రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే ఇంకెంతో చేస్తారన్నారు. గారపాటి లోకేశ్వరి, నందమూరి దీపిక, నందమూరి మాదవిమణి, కంఠమనేని శ్రీనివాస్‌ ప్రసాద్‌, కవితా ప్రసాద్‌, గౌరీనేని చంద్ర, శాంతి, వల్లూరిపల్లి దుర్గాప్రసాద్‌, శారద, తెదేపా, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని