logo

బలోపేతమన్నావు.. బలిపీఠమెక్కించావు

 పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారువైకాపా ప్రభుత్వం పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది. మా గ్రామంలో 40 మంది వాలంటీర్లు ఉన్నారు.

Updated : 09 May 2024 06:41 IST

విధుల్లేక తల్లడిల్లిన సర్పంచులు

ఆర్థిక సంఘ నిధులు మళ్లించిన జగన్‌

 పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారువైకాపా ప్రభుత్వం పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది. మా గ్రామంలో 40 మంది వాలంటీర్లు ఉన్నారు. వారికి నెలకు రూ.2లక్షలు చొప్పున ఏడాదికి రూ.24లక్షల వంతున వేతనాల కింద ఖర్చు పెడుతున్నారు. కనీసం ఆ మొత్తం (రూ.24 లక్షలు) కూడా మా గ్రామానికి మంజూరు చేయ లేదు. అంటే వాలంటీర్ల పాటి ప్రాధాన్యత కూడా పంచాయతీకి ఇవ్వలేదు. తెదేపా హయాంలో చెత్త సేకరణ, నిర్వహణకు క్లాప్‌ మిత్రల వేతనాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చెల్లించేది. వైకాపా పాలనలో వారి వేతనాలను పంచాయతీలే చెల్లించుకోవాలని చెప్పారు. నిధుల్లేని పరిస్థితుల్లో చివరకు చెత్త సేకరణ, వాటి నిర్వహణ కూడా పంచాయతీలు చేసే పరిస్థితి లేకుండా పోయింది.

 - బి.ప్రసాద్‌, సర్పంచి, కఠెవరం గ్రామం, తెనాలి మండలం


మేము అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం. పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో తలెత్తుకునేలా చేస్తాం.
-ఇదీ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట.


పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ పంచాయతీలో పరిసరాలు పరిశుభ్రపర్చడానికి సూమారు 15 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కార్మికులకు 6 నెలల నుంచి పంచాయతీ అధికారులు వేతనాలు అందించడం లేదు. దీంతో పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారిలో కొన్ని విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. నిధులు లేకపోవడంతో దీపాలు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొనడం గమనార్హం.

జగన్‌ చెప్పిన మాటలకు.. చేసిన పనులకు పొంతన లేదు. మాట తప్పారు. పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా నిధులు మంజూరు చేయలేదు సరి కదా.. కేంద్రం అందించే ఆర్థిక సంఘ నిధులను కూడా దారి మళ్లించారు. పలుమార్లు ప్రత్యక్ష ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. సమస్యలు వినకపోగా పైపెచ్చు అరెస్టులు చేసి వారిని ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఐదేళ్లుగా ఆత్మగౌరవం దెబ్బతిని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిధులు లేవు.. విధులు లేవు.. గౌరవం లేదు.. నమ్ముకుని ఎన్నుకున్న ప్రజలకు ముఖం చాటేయాల్సిన దుస్థితి. ఇదీ జగనన్న పాలనలో స్థానిక సంస్థల ప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పరిస్థితి. కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు తగిన గౌరవం లభించక వారు కార్యాలయానికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.

ఈనాడు-అమరావతి, -న్యూస్‌టుడే, చేబ్రోలు, పొన్నూరు, తెనాలి

పల్లెవాసులకు ఏ కష్టమొచ్చినా కళ్లెదుట కనిపించే సర్పంచులని అడుగుతారు. చెత్త తీయాలన్నా.. మురుగు కాల్వలు శుభ్రం చేయాలన్నా.. వీధి దీపాలు బాగు చేయాలన్నా.. తాగునీటి సరఫరా.. దోమల మందు పిచికారీ ఇలా ప్రతి పనికి సర్పంచుల వైపు చూస్తారు. తనను నమ్ముకుని ఎన్నుకున్న పల్లె ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తున్న సర్పంచులు అప్పులు చేసి పనులు చేసినా ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆర్థికంగా కుదేలయ్యారు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు వచ్చే నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం మింగేస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.

కేంద్రం ఇచ్చినా జమ చేయని రాష్ట్రం

కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినా గ్రామ పంచాయతీలకు సకాలంలో జమ చేయడం లేదు. కొంత సొమ్ము విద్యుత్తు బిల్లుల బకాయిలకు జమ చేసుకోగా మిగిలినది ఖాతాల్లో వేయడం లేదు. జిల్లాకు ప్రతి మూడు నెలలకు ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.9.06 కోట్లు వస్తున్నాయి. వీటి కోసం సర్పంచులు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినా వాటిలో పారిశుద్ధ్య కార్మికులు, క్లాప్‌ మిత్రలకు వేతనాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఇవి చెల్లిస్తుండడంతో పల్లె గల్లా పెట్టెలు ఖాళీ అవుతున్నాయి. జిల్లా పరిషత్‌కు ఐదేళ్లలో ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు, దుకాణాల అద్దె, రేవులు వేలం, భూముల కౌలు, సీనరేజీ రూపంలో ఆదాయం ద్వారా ఐదేళ్లలో సాధారణ నిధులు రూ.50 కోట్లు సమకూరాయి. వీటితో కొన్నిచోట్ల సీసీరోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, తాగునీటి పథకాల మరమ్మతు, పాఠశాల భవనాలు, అతిథిగృహాల మరమ్మతులు చేపట్టారు. ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో ఒక్క పనీ చేయలేదు.


అప్పు చేసి రూ.10 లక్షలు ఖర్చు చేశా

మా గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రెండేళ్ల కిందట రూ.10 లక్షలు అప్పు చేసి వివిధ అభివృద్ధి పనులు చేశా. రోజులు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాలేదు. అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నా. అధికారులు వైకాపా నేతల మాటలు విని ఎటువంటి పనులకు సహకరించడం లేదు. అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజలు అనేక సమ్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు చేస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నా.
- తోట వీరరాఘవమ్మ, నారాకోడూరు సర్పంచి


రూ.30 కోట్ల వరకు బకాయిలు..

గ్రామ పంచాయతీలకు ఆయా గ్రామాల పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీల నుంచి పంచాయతీల వాటా జమ చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో మైనింగ్‌ సెస్‌ జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటిని పంచాయతీలకు జమ చేయకపోవడంతో నిధుల లభ్యత తగ్గింది.

గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలేవీ..

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి గ్రీన్‌ అంబాసిడర్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి నెలకు రూ.6వేలు చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించడం, చెత్త నుంచి సంపద సృష్టించే పనులు వీరితో చేయిస్తున్నారు. వీరికి స్వచ్ఛభారత్‌ మిషన్‌ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అవి రాకపోవడంతో సర్పంచులు సొంత జేబు నుంచి చెల్లించి వారు విధులకు వచ్చేలా చూస్తున్నారు.

గౌరవం లేక ముఖం చాటేస్తున్న ప్రజాప్రతినిధులు

గ్రామాల్లో గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత సర్పంచుల ప్రాతినిధ్యం బాగా తగ్గిపోయింది. వాస్తవం చెప్పాలంటే సర్పంచి లేకుండానే పాలన సాగిపోతోంది. ఉద్యోగులందరూ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పని చేస్తుండడం, సర్పంచులకు ప్రత్యేకమైన విధులు లేకపోవడంతో ప్రాధాన్యం తగ్గింది. సర్పంచుల పరిస్థితి ఇలా ఉంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వారికి ప్రత్యేకంగా కార్యాలయాలు లేకపోవడం, నిధులు కూడా వారి పరిధిలో లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ఎంతో ఆసక్తితో ప్రజలకు సేవ చేయడానికి వస్తే ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు