logo

ఎన్నికల మద్యం.. ఒళ్లుగుల్ల తథ్యం..

 మా ప్రాంతం లో రోజు వారీ కూలీలు, పనులు చేసుకునేవారే ఎక్కువ. కొన్నేళ్ల నుంచి మద్యం తాగే అలవాటు ఉన్న వారిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అనారోగ్య సమస్యలు పెరిగాయి

Updated : 09 May 2024 06:47 IST

ఓటర్లూ పారాహుషార్‌
ఏరులా పారించేందుకు యత్నాలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో మద్యం ఏరులా పారించి ఓట్లు రాబట్టుకోవాలని కొందరు నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. స్థానికంగా అమ్ముతున్న నాసిరకం మద్యం చాలదన్నట్లు గోవా నుంచి రూ.26కే క్వార్టరు బాటిళ్లు తెప్పిస్తున్నారు. ప్రచారాల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి నాసిరకం మద్యం పంపిణీ చేస్తున్నారు. ఓటుకు నోటుతో పాటు మద్యాన్ని ఎర వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగిన వారు కాలేయం పాడై ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలింగ్‌ రోజు నాయకులు పంచే మందు కోసం ఆశ పడితే ఆరోగ్యం గుల్లవుతుంది.

ఊరూరా గొలుసు దుకాణాలు..

మండలానికి మూడు, నాలుగు దుకాణాల చొప్పున సర్కారీ మద్యం దుకాణాలు కొనసాగున్నాయి. వీటికి అదనంగా ఊరూరా గొలుసు దుకాణాలు వెలిశాయి. వాటిల్లో రాత్రీ పగలు, తేడా లేకుండా ఏ సమయంలో అయినా మద్యం దొరుకుతోంది.

మద్యం వల్ల కలిగే అనర్థాలు

ఆర్థికంగా చితికిపోతారు
కుటుంబ కలహాలు పెరుగుతాయి
అనారోగ్యం పాలై చివరకు ప్రాణాలు కోల్పోతారు


ప్రత్తిపాడుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కూరగాయలు విక్రయిస్తూ జీవించేవారు. తాగుడుకు బానిసయ్యాడు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యం తాగడంతో పేగు, కాలేయ సమస్యలు వచ్చి అనారోగ్యం పాలయ్యారు. మద్యం మానేసి ఆస్పత్రిలో చికిత్స పొందడంతో ఆరోగ్యం కాస్త కుదుట పడింది.ఆయన కొద్దిరోజులు ఆగి మళ్లీ మద్యం తాగడం మొదలు పెట్టడంతో పేగుళ్లో పుండ్లు, లివర్‌, కిడ్నీ సమస్యలు వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పది రోజుల తర్వాత చనిపోయారు. మృతుడి భార్య కూరగాయల దుకాణంలో పని చేస్తూ పిల్లలను చదివించుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతోంది.

నాసి మద్యం చాలా ప్రమాదకరం

మద్యంలో ఆల్కాహాల్‌ శాతం మోతాదుకు మించి ఉంటోంది. ఇదే ప్రాణాంతకానికి దారి తీస్తోంది. ఇథనాల్‌, మిథనాల్‌ ఉంటాయి. బీరులో 4 శాతం, రమ్మూ, జిన్ను, వైన్‌ వంటి వాటిల్లో అత్యధికంగా 30-40 శాతం వరకు ఇథనాల్‌ ఉంటుంది. నాటుసారా, నాటు మందు, కల్లు వంటి వాటిల్లో ప్రమాదకరమైన మిథనాల్‌ కలిపి విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ధర ఎక్కువగా ఉంటోందని తక్కువ ధరకు దొరికే మద్యం తాగి అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రిలో చేరుతున్నారు. నాసిరకం మద్యం వల్ల కాలేయం పాడైపోతుంది. చూపు కోల్పోతారు. పొట్టలో బాగా యాసిడ్‌ చేరి పేగులు దెబ్బతింటాయి. క్రమేపీ అన్ని అవయవాలు దెబ్బతిని ఆకస్మికంగా చనిపోతారు. -నాగూర్‌ బాషా, సహాయ ఆచార్యుడు, జీర్ణకోశ వ్యాధుల విభాగం,

జీహెచ్‌ కుటుంబమంతా బాధలు భరించాలి

నాసి మద్యానికి బానిసలై యువత తమ జీవితాల్ని చేజేతులా కాలరాసుకున్న ఉదంతాలు ఈ ఐదేళ్లలో ఎక్కువైంది. చదువుపై ఆసక్తి తగ్గడం, బ్యాక్‌లాగ్స్‌ పేరుకుపోవడం, కుటుంబ సభ్యులతో దుందుడుకుగా వ్యవహరించడం, విచక్షణ కోల్పోవడం, వారిలో వారే పిచ్చిగా మాట్లాడుకోవటం, వెకిలి నవ్వులు వంటివి చేస్తారు. వీరి చర్యల వల్ల కుటుంబమంతా మానసికంగా కుంగిపోతుంది. వ్యసనపరుల మానసిక పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ఒక్కసారిగా వారిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరికి కాళ్లు, చేతులు వణుకుతాయి. రాత్రి పూట సరిగ్గా నిద్రపోరు. నరాలు, మతిమరుపు సమస్యలు వస్తాయి. వారిని మద్యానికి దూరంగా ఉంచేందుకు కుటుంబమంతా  అప్రమత్తంగా ఉండాలి.

- ఆచార్య వి.వెంకటకిరణ్‌, సహ ఆచార్యులు, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్‌


డబ్బూ, ఆరోగ్యం రెండూ పాయె.. -ఖాదర్‌వలి, అన్నపూర్ణనగర్‌, గోరంట్ల

గతంలో మద్యం బాటిల్‌ రూ.60కు లభ్యమయ్యేది. ప్రస్తుతం రూ.200 అయింది. అధిక ధర తీసుకుంటున్నా నాణ్యమైన మద్యం దక్కడం లేదు. ఎంత ఖరీదైనా కొని తాగక తప్పడం లేదు. డబ్బుతో పాటు ఆరోగ్యం పాడవుతోంది.

చాలా మంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి

 మా ప్రాంతం లో రోజు వారీ కూలీలు, పనులు చేసుకునేవారే ఎక్కువ. కొన్నేళ్ల నుంచి మద్యం తాగే అలవాటు ఉన్న వారిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అనారోగ్య సమస్యలు పెరిగాయి. కొంత మంది లివర్లు పాడై మంచాల్లో ఉన్నారు. పనులు చేసుకునే పరిస్థితి లేదు. నాసి మద్యం వల్లే ఇలా జరిగిందని అందరూ భావిస్తున్నారు. మద్యం మత్తులో గొడవలు బాగా పెరిగాయి. పోలింగ్‌ సమీపిస్తున్నందున మద్యం పంపిణీ ఊపు అందుకుంటోంది. నాణ్యత లేని మద్యం తాగితే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.

 -షేక్‌.మస్తాన్‌వలి, చినరావూరు, తెనాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని