logo
Published : 02/12/2021 03:01 IST

జీహెచ్‌ఎంసీకి కొత్త చట్టం అవసరం

పాలనా లోపాలపై గవర్నర్‌కు సుపరిపాలన వేదిక లేఖాస్త్రం
ఈనాడు, హైదరాబాద్‌

అవినీతి, ఖాళీ ఖజానా, వార్డు కమిటీల ఏర్పాటులో జాప్యం వంటి పలు సమస్యలను ప్రస్తావిస్తూ నగరంలోని సుపరిపాలన వేదిక రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ సమర్పించింది. అంతకంతకు విస్తరిస్తోన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజల అవసరాలకు తగ్గట్లు పౌరసేవలు మెరుగుపడడంలేదని కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు. మురికివాడలు పెరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలు ఏటా వరద సమస్య ఎదుర్కొంటున్నాయని, రోడ్లపై గుంతలు పడి జనం అవస్థలు పడుతున్నారని, నాలాలు, కాలువల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలతో నగరం ప్రణాళికలేని కాంక్రీటు వనంలా తయారవుతోందని వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా సమస్యల నివారణకు ఆయన పలు డిమాండ్లు చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శికి చేరవేసి, అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి గవర్నర్‌ను కోరారు.
డిమాండ్లు ఇవి
* గ్రేటర్‌కు కొత్త చట్టం కావాలి. 1995 నాటి చట్టం స్థానంలో 2020లో కొత్త చట్టం తెస్తామన్న సర్కారు హామీ అమలుకు నోచుకోవడం లేదు.
* జలమండలిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలి. మురుగునీరు, తాగునీటి సేవలకు పౌరులు చెల్లించే శిస్తు జీహెచ్‌ఎంసీకి చెల్లించే ఆస్తిపన్నులో ఓ భాగం. జలమండలి వాటికి మరోమారు ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తోంది. రెండింటి విలీనంతో పౌరులపై ఆర్థిక భారం తగ్గుతుంది. సేవలు మెరుగుపడతాయి.
* ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. జీహెచ్‌ఎంసీకి నేరుగా వచ్చే ఆదాయం రూ.3 వేల కోట్లు. అది ఏమాత్రం సరిపోదు. రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర పద్దు నుంచి 11 శాతం నిధులు స్థానిక సంస్థలకు బదిలీ కావాలని చెబుతున్నా.. సర్కారు ఆచరించడంలేదు.
* అవినీతిని నిర్మూలించాలి. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల కారణంగా.. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల్లో సగం కూడా పనుల మీద ఖర్చవడంలేదు. నగరంలో 1.30 లక్షల అక్రమ నిర్మాణాలున్నాయంటే సంస్థ పనితీరు ఏ తీరుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
* వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థల్లో కీలకంగా పని చేయాల్సిన వార్డు స్థాయి కమిటీలను.. పాలకమండలి ఎన్నికై ఏడాదవుతున్నా ఏర్పాటు చేయలేదు.  
* ఆహారకల్తీ నివారణ చర్యలు మెరుగుపడాలి. కొందరు వ్యాపారులు కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. ఆహారకల్తీ ఇన్‌స్పెక్టర్లు తరచూ తనిఖీలు చేసి, కల్తీ ఆహారాన్ని నిరోధించేలా చర్యలు తీసుకోవాలి. నాసిరకం, ఆహార కల్తీ, పండ్లను మగ్గబెట్టేందుకు ఉపయోగించే హానికర పద్ధతులను జీహెచ్‌ఎంసీ తీవ్రంగా పరిగణించాలి. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని