logo

చెత్తను అమ్మేయండి

ఇంట్లో పోగయిన చెత్తను సొమ్ము చేసుకోవచ్చని చెబుతున్నాయి నగరానికి చెందిన ఎన్జీవోలు, అంకుర సంస్థలు. ఫోన్‌కాల్‌ లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వెంటనే ఇంటి ముందు ప్రత్యక్షమై బరువు ఆధారంగా ధర చెల్లించి తీసుకెళ్తున్నారు. పొడి

Published : 14 Mar 2022 01:24 IST

 ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్న స్టార్టప్‌ కంపెనీలు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ఇంట్లో పోగయిన చెత్తను సొమ్ము చేసుకోవచ్చని చెబుతున్నాయి నగరానికి చెందిన ఎన్జీవోలు, అంకుర సంస్థలు. ఫోన్‌కాల్‌ లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వెంటనే ఇంటి ముందు ప్రత్యక్షమై బరువు ఆధారంగా ధర చెల్లించి తీసుకెళ్తున్నారు. పొడి వ్యర్థాలను వేరుచేసి రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలించి వ్యాపారంతో.. పాటు పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. నగరంలో ఏటా 7.51లక్షల టన్నుల వ్యర్థాలు పోగవుతుంటే అందులో 20శాతం మాత్రమే రీసైక్లింగ్‌ అవుతోంది. నగరంలో ఒక్కో మనిషి ఏడాదిలో సగటున దాదాపు ఏడుకిలోల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పోగుచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.


క్రాప్‌బిన్‌

వ్యర్థాలను సేకరిస్తున్న క్రాప్‌బిన్‌ ప్రతినిధులు

2018లో ప్రారంభించిన ఈ అంకుర సంస్థలో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. ఈ సంస్థ కొండాపూర్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, బాచుపల్లి, యాప్రాల్‌, సైనిక్‌పురి, కేపీహెచ్‌బీ, నల్లగండ్ల, తెల్లాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బేగంపేట్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మణికొండ, అల్కాపూర్‌, పుప్పాలగూడ, ఖైరతాబాద్‌, టోలీచౌకి, షేక్‌పేట్‌, హిమాయత్‌నగర్‌, అమీర్‌పేట్‌, కాచిగూడ ప్రాంతాల్లో వీరు ఈ సేవలు కొనసాగిస్తున్నారు. గృహ, వాణిజ్య, ఆసుపత్రులు, సంస్థల్లో పోగయిన పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, పాత పత్రికలు, కాగితాలు, మ్యాగజైన్లు, కార్ట్‌బోర్టులు, గాజు వస్తువులు, మృదువైన ప్లాస్టిక్‌, స్టీల్‌, అల్యూమినియం, కాపర్‌, లోహ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. మరిన్ని వివరాలకు  https://crapbin.com/వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.


స్క్రాప్‌క్యూ...

రీసైక్లింగ్‌ కేంద్రం

24 చెట్లను నరికితే 1000 కేజీల కాగితం తయారవుతుంది. కాగితపు వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ చేస్తే ఆ చెట్లను కాపాడినట్టే అనే నినాదంతో పనిచేస్తోంది ఈ సంస్థ. చెట్లను కాపాడటంతో పాటు పేపర్‌ను ఉత్పత్తి కోసం వినియోగించే విద్యుత్‌ను 75శాతం ఆదాచేసినట్లే అని చెబుతోంది. హైదరాబాద్‌ వ్యాప్తంగా 2,300 ఏజెంట్లతో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. సీడీలు, పాత క్యాసెట్లు, పాడైన రిఫ్రిజిరేటర్‌, మైక్రో ఓవెన్‌ తదితరాలకు ఎంతెంత ధర నిర్ణయిస్తున్నారో వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొంటారు. ఆయా పరిమాణాలను బట్టి ధర మారొచ్చు. బుకింగ్‌ చేసుకోవాలంటే https://scrapq.com/hyderabad/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 040 30707070 నంబర్‌ను సంప్రదించొచ్చు.


భూమి ఎన్జీవో.. గిఫ్ట్‌ యువర్‌ స్క్రాప్‌

గిఫ్ట్‌ యువర్‌ స్క్రాప్‌ పేరుతో వినూత్న ప్రయత్నాన్ని ప్రారంభించింది నగరానికి చెందిన భూమి ఎన్జీవో. వృథాగా పారేసే వ్యర్థాలను ఈ సంస్థకు విక్రయించొచ్చు లేదంటే బహుమతిగా ఇవ్వొచ్చు. ఇలా పోగుచేసిన పొడి చెత్తను రీసైక్లింగ్‌ యూనిట్లకు పంపుతున్నారు. దీని ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని పేద విద్యార్థులకు ఉపకార వేతనంగా అందిస్తున్నారు. చెత్తను విరాళంగా ఇచ్చేవారు ముందుగా గూగుల్‌లో ఫామ్‌ను నింపాలి. న్యూస్‌పేపర్లు, కార్టూన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తదితరాల వివరాలు, వాటి బరువును అందులో నమోదు చేయాలి. అనంతరం రీసైక్లింగ్‌ చేసే సంస్థకు ఆ వివరాలను పంపి వ్యర్థాలను సేకరిస్తారు. వివరాలకు భూమి ఎన్జీవో వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని