Hyderabad: అలర్ట్‌.. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్‌, నాంపల్లి, ట్యాంక్‌బండ్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గండిపేట్‌...

Updated : 26 Sep 2022 21:03 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్‌, నాంపల్లి, ట్యాంక్‌బండ్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గండిపేట్‌, కిస్మత్‌పురా, అత్తాపూర్‌ జాగీర్‌, మణికొండ, నార్సింగి, కాటేదాన్‌, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, బోలక్పూర్, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్ నగర్, రామ్‌నగర్, దోమలగూడ, పాతబస్తీ చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై వర్షం నీరు చేరడంతో మరో రెండు గంటల పాటు నగరవాసులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరారు. లేదంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. తాజా పరిస్థితిపై ప్రజలకు అప్‌డేట్స్‌ ఇవ్వాల్సిందిగా ఎఫ్‌ఎమ్‌, మీడియాను పోలీసులు కోరారు. పురాతన భవనాలు, బలహీనమైన భవంతులు, గోడలకు దూరంగా ఉండాలని సూచించారు. వరదనీరు ప్రవహించే రోడ్లు, కల్వర్టులు, వంతెనలు నిర్లక్ష్యంగా దాటవద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100కి, లేదా 94906-17111 నంబర్‌ను సంప్రదించాలని నగరవాసులకు పోలీసులు సూచించారు.

నీట మునిగిన మూసారాంబాగ్‌ వంతెన..

నగరంలో కురిసిన భారీ వర్షానికి అంబర్‌పేటలోని మూసారాంబాగ్‌ వంతెన నీట మునిగింది. లోతట్టు ప్రాంతం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన వరద నీరు మొత్తం మూసారాంబాగ్‌ వంతెన పైకి చేరింది. దీంతో వంతెన నీట మునిగింది. వంతెనకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గోల్నాక వంతెన మీదుగా దారి మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని