logo

Hyderabad: అద్దెకు అమ్మాయిలు.. పార్కుల్లో పెళ్లిచూపులు

మూడు పదులు దాటినా పెళ్లికాని, పెళ్లి అయినా విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురు చూసేవారిని సైబర్‌ నేరస్థులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

Updated : 29 Nov 2022 10:09 IST

వివాహ పరిచయ వేదికల్లో ఘరానా మోసాలు

ఈనాడు, హైదరాబాద్‌: మూడు పదులు దాటినా పెళ్లికాని, పెళ్లి అయినా విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురు చూసేవారిని సైబర్‌ నేరస్థులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తీరా మోసపోయిన కొందరు బాధితులు కేసులు పెట్టడం లేదు. పోలీసు అధికారులతో పరిచయాలున్నవారు మాత్రం తమకు సాయం చేయమని కోరుతున్నారని నగర సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపారు. అపరిచితులతో వ్యక్తిగత విషయాలు.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాధితులు టోల్‌ఫ్రీ 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

ఆశ చూపి.. సొమ్ము కొట్టేసి

సైబర్‌ నేరగాళ్లు వివాహ పరిచయ వేదికలను అడ్డాగా చేసుకుని తమ వద్ద పనిచేసే టెలీకాలర్స్‌ను పెళ్లికూతుళ్లుగా పరిచయం చేస్తారు. కాఫీక్లబ్‌లు, పార్కుల్లో పెళ్లిచూపులు నిర్వహిస్తారు. ఆ అమ్మాయిలు అబ్బాయిల ఫోన్‌ నంబర్లు తీసుకుని ఛాటింగ్‌ ప్రారంభిస్తారు. బహుమతులు, పాకెట్‌మనీ, కుటుంబ అవసరాల పేరిట వీలైనంత పెద్దమొత్తంలో గుంజుతారు. కొద్దిరోజుల తరువాత అభిరుచులు, ప్రవర్తన నచ్చలేదంటూ యువకులకు ఫోన్‌ చేసి చెబుతారు. అవతలి వైపు నుంచి గట్టిగా నిలదీస్తే లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయిస్తామంటూ బెదిరిస్తారు. సరూర్‌నగర్‌లో ఓ వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు కూకట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.లక్షన్నర వసూలు చేసినట్టు ఫిర్యాదు చేయటంతో ఈ గుట్టు వెలుగు చూసింది.

ఇదీ నైజీరియన్ల తీరు

విద్యార్థి, పర్యాటక, వ్యాపార వీసాలతో నైజీరియన్లు వచ్చి దిల్లీ, హరియాణా చుట్టుపక్కల మకాం వేస్తున్నారు. ఎస్‌.ఆర్‌.నగర్‌కు చెందిన ఓ మహిళకు మ్యాట్రిమోనీ సైట్‌లో అమెరికాలో సివిల్‌ ఇంజినీర్‌గా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజులకు ఆభరణాలు బహుమతిగా పంపుతున్నట్టు చెప్పారు. అవి దిల్లీ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారుల వద్ద ఉన్నట్టు మరో వ్యక్తి రంగ ప్రవేశం చేసి పన్నుల పేరిట రూ.18 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో గతనెల సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఇతను సుమారు 50 మంది మహిళలను మోసగించినట్టు గుర్తించారు. మరో నైజీరియన్‌ పెళ్లి పేరుతో దేశవ్యాప్తంగా 300 మంది మహిళలు/యువతులను మోసగించి రూ.కోట్లు వసూలు చేశాడు. మే నెలలో నొయిడా పోలీసులు మాయగాడిని అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని