TS Assembly: బడ్జెట్‌ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై బీఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్‌, 20 రోజుల పాటు నిర్వహించాలని మజ్లిస్‌ పార్టీ కోరాయి.

Published : 03 Feb 2023 16:34 IST

హైదరాబాద్‌: బడ్జెట్‌, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ అనంతరం అవసరమైతే మిగిలిన అంశాలపై చర్చ చేపట్టాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయిచింది. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన  జరిగిన బీఏసీ సమావేశంలో ఉపసభాపతి పద్మారావు, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌, కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని భట్టి కోరారు. కనీసం 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలన్నారు. అన్ని అంశాలపై చర్చిద్దామన్న మంత్రులు.. బడ్జెట్‌పై, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమయ బిల్లు అనంతరం అవసరం అనుకుంటే మిగిలిన అంశాలపై చర్చిద్దామని తెలిపారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులకు సరిగా ప్రొటోకాల్‌ ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ప్రస్తావించారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ నిర్మాణం అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. బడ్జెట్‌ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలన్న మజ్లిస్‌ పార్టీ.. సమావేశాల్లో చర్చించేందుకు 25 అంశాలను ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని