logo

Ganesh Nimajjanam: మహానిమజ్జనం.. సర్వం సిద్ధం

లంబోదరుడి నిమజ్జనోత్సవానికి నగరం ముస్తాబైంది. గురువారం పదకొండో రోజు జరగనున్న నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్దీ జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలు సిద్ధమయ్యాయి.

Updated : 27 Sep 2023 10:11 IST

నెక్లెస్‌రోడ్డులో కరిముఖుడికి వీడ్కోలు పలుకుతుండగా చరవాణుల్లో బంధిస్తున్న యువత

ఈనాడు, హైదరాబాద్‌: లంబోదరుడి నిమజ్జనోత్సవానికి నగరం ముస్తాబైంది. గురువారం పదకొండో రోజు జరగనున్న నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్దీ జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఇతరత్రా కలిపి మరో 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయని, అన్ని ప్రాంతాల్లో క్రేన్లు, ఇతర యంత్రాలు, సిబ్బందికి విధులు కేటాయించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. శోభాయాత్ర జరిగే రహదారుల పొడవునా పారిశుద్ధ్య కార్యక్రమాలు, బారికేడ్లు, సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. భక్తులు, నిమజ్జన సిబ్బంది, కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు నీళ్లలో పడితే.. వారిని వేగంగా రక్షించేందుకు నగరవ్యాప్తంగా 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు. సాగర్‌ చుట్టూ, పలు రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపకశాఖ వాహనాలు అందుబాటులో ఉంచారు. జలమండలి పది లక్షల నీళ్ల ప్యాకెట్లను అందుబాటులో ఉంచనుంది.

40 వేల మంది సిబ్బందితో అసాధారణ భద్రత

ప్రతిష్ఠాత్మక గణేశ్‌ ఊరేగింపు, నిమజ్జనం కోసం రాజధాని నగరంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలో కలిపి రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసుల్ని బందోబస్తు కోసం ఉపయోగిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 25,694 మంది విధుల్లో పాల్గొంటున్నారు. 125 ప్లటూన్ల అదనపు బలగాలు, ఆర్‌ఏఎఫ్‌, పారా మిలిటరీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. సైబరాబాద్‌, రాచకొండలో కలిపి 13 వేల మంది గస్తీలో పాల్గొననున్నారు. దాదాపు 48 గంటలపాటు సాగే ఉరేగింపు, నిమజ్జనంలో 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ముగ్గురు కమిషనర్లు సీవీ ఆనంద్‌, డీఎస్‌ చౌహాన్‌, స్టీఫెన్‌ రవీంద్ర దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జనం జరిగే ప్రాంతాల్ని నేరుగా సందర్శించి భద్రతను సమీక్షించారు. రూట్‌మ్యాప్‌ ఖరారు చేశారు. 

సున్నిత పరిస్థితుల నేపథ్యంలో..

నగర పోలీసు చరిత్రలో అత్యంత సున్నితమైన గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ 35 ఏళ్ల తర్వాత ఈసారి ఒకే రోజు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ముస్లిం మత పెద్దలతో మాట్లాడి మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీని ఒకటో తేదీకి వాయిదా వేయించారు. కొందరు మాత్రం అదే రోజు జరపాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి సున్నితమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మూడు కమిషనరేట్లలోనూ అసాధారణ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 

భక్తులు నేరుగా విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఇనుప జాలీ

వార్‌రూమ్‌..  కమాండ్‌ కంట్రోల్‌

హైదరాబాద్‌ పోలీసులు బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని వార్‌రూమ్‌ ద్వారా కీలక ప్రాంతాల్ని గమనించేలా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకూ 19 కిలోమీటర్లు సాగే ఊరేగింపు మార్గాల్లోని ప్రధాన ప్రాంతాలన్నీ నిఘా కెమెరాల నీడలో ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌కు 3,600 సీసీ కెమెరాలు అనుసంధానించారు. సైబరాబాద్‌లో 6 వేల కెమెరాలతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించే వ్యవస్థ ఉంది. వీటికి అదనంగా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీసుల అంచనా ప్రకారం ఈ సారి సుమారు 1.20 లక్షలకుపైగా గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశముంది.

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్‌- హుస్సేన్‌సాగర్‌ మార్గంలో ఏర్పాట్లు, భద్రతను సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. పర్యటనలో నగర అదనపు పోలీస్‌ కమిషనర్లు విక్రమ్‌ సింగ్‌ మాన్‌, సుధీర్‌బాబు, విశ్వప్రసాద్‌, డీసీపీలు సాయిచైతన్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక బస్సులు.. అర్ధరాత్రి వరకూ మెట్రో

  • ఆర్టీసీ నగరం నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌కు 535 బస్సులు నడుపుతోంది.
  • భక్తుల కోసం రాత్రి వరకూ, 29 వేకువజామున ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
  • గురువారం అర్ధరాత్రి దాటి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడుపుతున్నారు. ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, గాంధీభవన్‌, నాంపల్లి మెట్రో స్టేషన్లలో ఇందు కోసం అదనపు సిబ్బందిని నియమించారు.

ప్రతి ఒక్కరూ సహకరించాలి

మాట్లాడుతున్న భగవంతరావు, చిత్రంలో హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు
సీవీ ఆనంద్‌, డీఎస్‌ చౌహాన్‌, ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు

అబిడ్స్‌, న్యూస్‌టుడే: వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక నిమజ్జనంలో డీజేలకు బదులు భక్తి గీతాలను ఆలపిస్తూ ముందుకు సాగాలని కోరారు. భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భగవంతరావు మాట్లాడుతూ.. నిమజ్జనం వేడుకలను ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రం కోరిందన్నారు. కార్యక్రమంలో రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌, ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, రామరాజు, తదితరులు పాల్గొన్నారు.

తరలించే వాహనాలు సిద్ధం

మహా గణపతులను గంగ ఒడికి చేర్చేందుకు వినియోగించేందుకు వాడే అతి భారీ ఇతర వాహనాలను రవాణాశాఖ సిద్ధం చేసింది. 250 టస్కర్లు (16 టైర్లతో కూడుకున్నవి), మరో 2 వేల ఇతర వాహనాలు అందిచనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణాశాఖ కమిషనర్‌ పాండురంగనాయక్‌ తెలిపారు. వీటిని బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు అందించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు