logo

Hyderabad: ప్రేమ వివాహం.. దీపావళి రోజే ఇంటి వెలుగును ఆర్పేశాడు

కులాలు వేరైనా ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనంతర కాలంలో ఆర్థిక సమస్యలకు తోడు భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

Updated : 14 Nov 2023 13:56 IST

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: కులాలు వేరైనా ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనంతర కాలంలో ఆర్థిక సమస్యలకు తోడు భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో దీపావళి రోజే ఇంటి వెలుగును ఆర్పేశాడు. నేరేడ్‌మెట్‌ సీఐ శివకుమార్‌, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వరంగల్‌ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన ఎ.స్రవంతి(22), సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ శ్రీగిరిపల్లికి చెందిన కారు డ్రైవర్‌ మహేందర్‌లు 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. వీరు ఏడాది క్రితం ఉప్పల్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లోని కందిగూడలో ఉండగా.. మహేందర్‌ ఓకేసులో జైలుకెళ్లాడు. స్రవంతి భర్తను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చింది. అందుకయిన ఖర్చు విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అనంతరం వారు నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని సమతానగర్‌కు మారారు.

కుటుంబంలో ఆర్థిక సమస్యలు, గొడవలు చోటుచేసుకోవడంతో స్రవంతి చాలా రోజులుగా తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్‌ భార్యకు ఫోన్‌ చేసి ఆదివారం ఇళ్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం సమతానగర్‌లో అద్దె ఇంటికి వెళ్లి చూడగా భర్త తన వస్తువులు తీసుకొని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మహేందర్‌ స్రవంతి ముఖంపై, తలపై బలంగా కొట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  ఆమె మెడకు చున్నీ చుట్టి ఈడ్చుకెళ్లి మంచం కింద దాచాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. చెల్లి, బావ ఏమైనా గొడవ పడుతున్నారా అని స్రవంతి అన్న ప్రశాంత్‌ ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానంతో తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడటంతో ఆమె మృతి చెంది ఉంది. పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని