logo

Youtuber Chandu: ప్రేమికుడు కాదు నయవంచకుడు!

ప్రేమించానన్నాడు.. వివాహం చేసుకుంటానంటూ సన్నిహితంగా మెలిగాడు. తీరా పెళ్లి పేరు ఎత్తడంతో ముఖంచాటేశాడు. దీంతో ఆ గిరిజన యువతి ఫిర్యాదు చేయగా నార్సింగి పోలీసులు యూట్యూబర్‌ కోలా చంద్రశేఖర్‌ సాయికిరణ్‌ అలియాస్‌ చందు(30)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated : 16 Dec 2023 07:47 IST

యువతిని మోసగించిన యూట్యూబర్‌ అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌, నార్సింగి, న్యూస్‌టుడే: ప్రేమించానన్నాడు.. వివాహం చేసుకుంటానంటూ సన్నిహితంగా మెలిగాడు. తీరా పెళ్లి పేరు ఎత్తడంతో ముఖంచాటేశాడు. దీంతో ఆ గిరిజన యువతి ఫిర్యాదు చేయగా నార్సింగి పోలీసులు యూట్యూబర్‌ కోలా చంద్రశేఖర్‌ సాయికిరణ్‌ అలియాస్‌ (Youtuber Chandu) చందు(30)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు..తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన చంద్రశేఖర్‌ సాయికిరణ్‌ లఘుచిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బండ్లగూడజాగీర్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. యూట్యూబ్‌ వీడియోలు, సినిమాల్లో సహనటుడిగా పేరు సంపాదించాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి (వైద్యురాలు) 2020లో హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. 2021 మార్చిలో డేటింగ్‌ యాప్‌లో ఆమెకు చంద్రశేఖర్‌ పరిచయమయ్యాడు. వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చాటింగ్‌ చేసుకున్నారు. అనంతరం కొద్దిరోజుల తరువాత ఇద్దరూ కలిసేవారు. ఆ సమయంలోనే  ఏడడుగులు నడుద్దామంటూ ఆమెతో బాసలు చేశాడు. 2021 ఏప్రిల్‌ 25న పుట్టిన రోజు వేడుకలకు రమ్మంటూ పుప్పాలగూడలోని ఇంటికి ఆహ్వానించాడు. అయిష్టంగానే వెళ్లిన ఆమెను ప్రేమ పేరిట లోబరుచుకున్నాడు. పెళ్లిచేసుకుంటానంటూ ప్రమాణం చేశాడు. నిజమని నమ్మిన ఆమె అతడి వద్దకు చేరింది.   సినిమాల్లో అవకాశాలు వస్తే గొప్పగా ఉండొచ్చంటూ చెప్పటంతో ఆమె నగలు తాకట్టుపెట్టి డబ్బులిచ్చింది. ఇటీవల ఆమె పెళ్లి ప్రతిపాదన తీసుకురావటంతో చంద్రశేఖర్‌ అసలు రూపం బయటపడింది. రూ.3 కోట్లు తీసుకొస్తేనే పెళ్లంటూ వేధించాడు. తక్కువ కులం ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే పరువు పోతుందంటూ అతడి తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ ఎస్‌.లక్ష్మినారాయణ, ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి పూర్తి ఆధారాలు సేకరించారు. గురువారం చంద్రశేఖర్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. యువకుడి బంధువులు పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని