logo

Indian Railway: బైపాస్‌తోనే రైళ్ల ఆలస్యానికి కళ్లెం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రైల్వేశాఖ

వందేళ్ల క్రితం నిర్మించిన రైల్వే స్టేషన్లు విస్తరణకు నోచుకోవడం లేదు. ప్రయాణికులు, రైళ్ల సంఖ్య పెరగడంతో స్టేషన్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి.

Updated : 07 Jan 2024 07:42 IST

 మౌలాలి - సనత్‌నగర్‌ లైనుతో అవకాశం

ఈనాడు - హైదరాబాద్‌: వందేళ్ల క్రితం నిర్మించిన రైల్వే స్టేషన్లు విస్తరణకు నోచుకోవడం లేదు. ప్రయాణికులు, రైళ్ల సంఖ్య పెరగడంతో స్టేషన్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో 10 ప్లాట్‌ఫాంలు ఉండగా 236 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి ఆగేందుకు ఖాళీ లేక నగర శివార్లలో ఆపేస్తున్నారు. సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య రెండో లైనుతో సమస్య పరిష్కారమవుతుంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేకుండా బైపాస్‌ చేయడానికి వీలవుతుంది.

బైపాస్‌తో సికింద్రాబాద్‌కు వెళ్లకుండా..  నగరంలోని మూడు రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా చర్లపల్లి స్టేషన్‌ సిద్ధమవుతోంది. ఇక్కడే దిగేసి ఓఆర్‌ఆర్‌ ద్వారా వివిధ ప్రాంతాలకు సొంత వాహనాల్లో చేరుకోవచ్చు. ఎంఎంటీఎస్‌ రెండోదశ పూర్తయితే.. ఆ సర్వీసులు సైతం చర్లపల్లిలో దిగే వారికి అందుబాటులోకి రానున్నాయి. చర్లపల్లి దాటిన తర్వాత ఘట్‌కేసర్‌ వరకూ ఎంఎంటీఎస్‌ రెండోదశ సిద్ధమైంది. విజయవాడతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు చర్లపల్లిలో ఆగి మౌలాలి మీదుగా సనత్‌నగర్‌ తర్వాత లింగంపల్లికి చేరుకోవచ్చు. మౌలాలి - సీతాఫల్‌మండి మధ్య ఎంఎంటీఎస్‌ రెండోదశలో భాగంగా రెండో లైను వేశారు. ఇదీ సిద్ధమైతే.. కాచిగూడకు వచ్చే రైళ్లను సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే బైపాస్‌ చేసే అవకాశం లభిస్తుంది.

ప్రస్తుతానికి చర్లపల్లి - సనత్‌నగర్‌కు అనుసంధానం

విజయవాడ నుంచి ముంబయి వైపు వెళ్లే రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లకుండా.. మౌలాలి-సనత్‌నగర్‌ మార్గంలో నడిపేందుకు అవకాశం లభించింది. చర్లపల్లి నుంచి మౌలాలి తర్వాత సనత్‌నగర్‌, హైటెక్‌సిటీ, లింగంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. మార్చి నాటికి సిద్ధమవుతున్న చర్లపల్లి స్టేషన్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని