logo

Hyderabad Metro: మూసీ నుంచి మెట్రో ముందుకు సాగేనా?

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులకు సంబంధించి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించిన పద్దులో మెట్రోకు ఈసారి ఏ మేరకు కేటాయింపులు దక్కనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Updated : 02 Feb 2024 07:33 IST

బడ్జెట్‌లో నిధుల కేటాయిస్తేనే ఆస్తుల సేకరణ, రహదారి విస్తరణ పనులు
ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు డీపీఆర్‌ సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులకు సంబంధించి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించిన పద్దులో మెట్రోకు ఈసారి ఏ మేరకు కేటాయింపులు దక్కనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల్లో.. మౌలిక ప్రాజెక్ట్‌లకు మొదటి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై అధికారవర్గాల్లో సందేహాలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపిస్తున్నాయి. పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్‌ కోసం నిధుల కేటాయిస్తే భూసేకరణ, రహదారుల విస్తరణ పనులను పూర్తి చేయవచ్చనేది మెట్రోవర్గాల ఆలోచనగా ఉంది.

నగరంలో మెట్రో విస్తరణలో భాగంగా 70 కి.మీ. మార్గాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి సంబధించి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) వచ్చేందుకు మూడు నెలల సమయం పడుతుంది. డీపీఆర్‌ లేనేదే నిధుల వ్యయంపై స్పష్టత రాదు. కాబట్టి కేంద్ర బడ్జెట్‌, రాష్ట్ర బడ్జెట్‌ల్లో పాతబస్తీకి మినహా మెట్రోకు సంబంధించి నిధులపై పెద్దగా ఆశలు లేవు.

పదేళ్ల క్రితమే ఆమోదం..

మెట్రోరైలు మొదటిదశలో మిగిలిన మార్గమే ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా 5.5కి.మీ.దూరం. అలైన్‌మెంట్‌ వివాదాలు, అనుమతుల జాప్యంతో నిర్మాణ అంచనా వ్యయం పెరిగిందని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఈ కొద్ది మార్గాన్ని పూర్తి చేయకుండా వదిలేసింది. ఇప్పుడు మెట్రో రెండోదశలో ఈ మార్గాన్ని చేర్చారు. డీపీఆర్‌ పదేళ్ల క్రితమే సిద్ధమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం పొందింది. ఈ పనులు మొదలుపెట్టాలంటే పాతబస్తీలో ఆస్తుల సేకరణ చేపట్టేందుకు నిధులు కావాలి. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటిబడ్జెట్‌లో మెట్రోకి సముచిత నిధుల కేటాయించాలనే అభ్యర్థనలు అధికార వర్గాలనుంచి ఉన్నాయి. రూ.2వేల కోట్ల వరకు వ్యయమయ్యే ప్రాజెక్ట్‌కు మొదటి ఏడాది రూ.500 కోట్లు కేటాయిస్తే భూసేకరణ, మిగతా ప్రాంతాల మెట్రో ప్రాజెక్టుల భూసేకరణ పూర్తవుతాయి.

నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ 5 కి.మీ.మార్గం డీపీఆర్‌ సిద్ధంగాఉన్నా కేంద్రం ఆమోదం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో పాతబస్తీ మెట్రోకే నిధులు అవసరం.


డీపీఆర్‌లు సిద్ధమయ్యాకే

- ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హైదరాబాద్‌ మెట్రోరైలు

కొత్త డీపీఆర్‌లు సిద్ధం చేసి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు 3 నెలల సమయం పడుతుంది. దీనికి బడ్జెట్‌తో సంబంధం లేదు. స్వతంత్రంగా కూడా ప్రభుత్వం నిధుల కేటాయించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని