logo

బకాయిల భారం.. వీధుల్లో అంధకారం

నగర పాలక సంస్థ, పురపాలికల్లో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా మారింది. మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడజాగీర్‌, హయత్‌నగర్‌, తుర్కయాంజాల్‌ పురపాలిక, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌ సమీపంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.

Updated : 02 Mar 2024 04:31 IST

దీపాల నిర్వహణ సంస్థకు పేరుకుపోతున్న చెల్లింపులు
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జనం అవస్థలు 

తుర్కయాంజాల్‌లో తిప్పలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నగర పాలక సంస్థ, పురపాలికల్లో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా మారింది. మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడజాగీర్‌, హయత్‌నగర్‌, తుర్కయాంజాల్‌ పురపాలిక, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌ సమీపంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించుకోవడంతో పాటు, నిర్వహణ భారాన్ని నియంత్రించుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా తరువాత పరిస్థితి అదుపు తప్పింది. ప్రధాన ప్రాంతాలు మినహా కాలనీలు, అంతర్గత రహదారులపై వీధి దీపాలు వెలగడం లేదు. వీటిని నిర్వహిస్తున్న ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రూ.కోట్లలో బకాయిలు పడటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామని తెగేసి చెప్పడమే కాకుండా సిబ్బందిని ఇతర ప్రాంతాలకు పంపించడం గమనార్హం.

కొండలా పేరుకుపోతూ..

  •  బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో 17 వేల వీధి దీపాలను ప్రైవేటు సంస్థ ఏర్పాటుచేసింది. వీరికి ఏడేళ్లలో రూ.4.96 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.2.49 కోట్లు ఇవ్వాలి. సకాలంలో నిర్వహణ ఖర్చులు ఇవ్వనందుకు ఆ సంస్థ రూ.1.59 కోట్లు కోరుతూ తాఖీదు ఇచ్చింది.
  •  బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌లో 14 వేల వీధి దీపాలు పెట్టారు. ఇందులో 20 శాతం వెలగడం లేదు. నిర్వహణ పేరుతో ప్రైవేటు సంస్థ నెలకు రూ.6 లక్షలు వసూలు చేస్తుండగా.. ఆరేడు నెలలుగా చెల్లించడం లేదు.
  •  మీర్‌పేట్‌ నగర పాలకసంస్థలో సుమారు 8 వేల వీధి దీపాలున్నాయి. రూ.1.20 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. దీంతో నిర్వహణ సంస్థ ఇద్దరు పనివారిని మాత్రమే ఉంచింది.

ఇబ్రహీంపట్నంలో ఇదీ తీరు..

నిశిరాత్రులు... ప్రమాదాల దారులు

పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్‌, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులున్నాయి. వీటికి అనుసంధానంగా ఉన్న రహదారులపై వీధిదీపాలను ఏర్పాటుచేశారు. నిర్వహణ లోపాలతో అవి సక్రమంగా వెలగడం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

  • ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 4400 వీధి దీపాలుండగా, 30 శాతం పనిచేయడం లేదు. శేరిగూడ నుంచి బొంగులూరు బాహ్యవలయ రహదారి వరకూ చిమ్మచీకట్లే. మున్సిపాలిటీ అధికారులు రూ.60లక్షల బకాయిలు చెల్లించాలి.
  • తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలో 12 వేల దీపాలున్నాయి. నిధుల కొరతతో నిర్వహణ సంస్థకు రూ.1.2 కోట్లు ఇవ్వలేదు. దీంతో సిబ్బంది విధులు నిర్వహించడం లేదు.
  • పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపాలిటీలో 8వేల వీధిదీపాలున్నాయి. ఇక్కడ రూ.కోటికిపైగా బకాయి ఉంది.

మీర్‌పేట్‌లో ముసిరిన చీకట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని