logo

TS News: త్వరలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి

రాజధానిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు మరో నలుగురైదుగురు భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు.

Updated : 19 Mar 2024 07:54 IST

ప్రత్యర్థి పార్టీల్లో కీలక నేతలే లక్ష్యంగా కాంగ్రెస్‌ అడుగులు

రాజధానిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు మరో నలుగురైదుగురు భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు. వీరి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం మాట తీసుకుందని చెబుతున్నారు. మరికొందరు భారాస  నేతలు హస్తం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారు. భారాస నుంచి చేరిన వారిలో ఆర్థికంగా ఉన్న వారిని లోక్‌సభ బరిలో నిలపాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. దీనికి అనుగుణంగా మంగళవారం దిల్లీలో జరిగే కాంగ్రెస్‌ అగ్రనేతల సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. బహుశా అదేరోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ అగ్రనేత ఒకరు తెలిపారు.

పదవులు.. హామీలు..

గ్రేటర్‌ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లనే కాంగ్రెస్‌ గెలిచింది. దీంతో సిటీలోని నాలుగు ఎంపీ స్థానాలను గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల మీట్‌ది ప్రెస్‌లోనూ ఆయన వెల్లడించారు. ‘‘గ్రేటర్‌ పరిధిలో అన్ని స్థానాల్లో విజయం సాధించడానికి మా వ్యూహాలు మాకున్నాయి...మీరే చూడండి’’ అని సీఎం అన్నారు. ఆయన మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు అర్థమవుతోందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. నగరం పరిధిలో పట్టున్న ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను వేగం చేసింది. కొందరికి పదవులు ఆశ చూపుతున్నారు.. మరికొందరికి హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం కాంగ్రెస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మరో ఇద్దరు మాజీమంత్రులు, మరో ఇద్దరు సీనియర్‌ ఎమ్మెల్యేలు, తొలిసారి గెలిచిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. వీరిని ఎన్నికల నోటిఫికేషన్‌ లోపు పార్టీలో చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అభ్యర్థిత్వాలపై అవగాహనకు..

గ్రేటర్‌లోని నాలుగు స్థానాలకు గాను మూడింటిలో అభ్యర్థుల విషయంపై అవగాహనకు వచ్చారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని పోటీకి నిలపాలని తొలుత భావించినా.. భారాస  ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనే బరిలో నిలిచే అవకాశాలున్నాయి. సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో నిలపాలని భావించారు. కానీ ఇక్కడా వ్యూహాన్ని మార్చాలని అనుకుంటున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. భద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సమర్థిస్తున్నారని చెబుతున్నారు.ఇటీవల మల్లారెడ్డి  డీకేను కలిసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ నుంచి మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను బరిలో నిలపాలని తొలుత అనుకున్నారు. రాష్ట్రంలో తూర్పుకాపు వర్గాన్ని సంతృప్తి పర్చడం కోసం అదే వర్గానికి చెందిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను బరిలో నిలపాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికే చెందిన వ్యక్తిని బరిలో నిలిపే అవకాశం ఉంది.  

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని