logo

Hyderabad: బస్‌పాస్‌ ఇవ్వని కండక్టర్.. కూకట్‌పల్లి డిపోకు రూ.10వేలు జరిమానా

ప్రయాణికుడు అభ్యర్థించినా ‘ట్రావెల్‌ యాజ్‌ యు లైక్‌(టేల్‌)’ టిక్కెట్‌ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఫిర్యాదీకి రూ.5వేల పరిహారం, రూ.5వేల కేసు ఖర్చులు చెల్లించాలని కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోను రంగారెడ్డి వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది.

Updated : 21 Mar 2024 08:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుడు అభ్యర్థించినా ‘ట్రావెల్‌ యాజ్‌ యు లైక్‌(టేల్‌)’ టిక్కెట్‌ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఫిర్యాదీకి రూ.5వేల పరిహారం, రూ.5వేల కేసు ఖర్చులు చెల్లించాలని కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోను రంగారెడ్డి వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. నాలుగేళ్లు విచారణ సాగిన కేసులో తాజాగా తీర్పు వెలువడింది. సంగారెడ్డి ప్రశాంత్‌నగర్‌కు చెందిన సీహెచ్‌.నాగేందర్‌ 2019 నవంబరు 6న పటాన్‌చెరు నుంచి ఖైరతాబాద్‌ వెళ్లేక్రమంలో ప్రతివాద డిపోకు చెందిన బస్సు ఎక్కారు. ఎక్కువ బస్‌స్టేషన్లు ఉండటంతో రోజువారీ బస్‌పాస్‌(టేల్‌) ఇవ్వాలని కండక్టర్‌ను కోరగా.. తిరస్కరించి టిక్కెట్‌ తీసుకోవాలన్నారు. ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది. బస్సు రద్దీగా ఉండటంతో చేసేదేమీ లేక నాగేందర్‌ టిక్కెట్‌ తీసుకున్నారు. ఈ గొడవలో పడి తన పర్సు, అందులో రూ.10,000 పోయాయని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. బస్సు పాస్‌ ఇవ్వకపోవడంతోనే ఇదంతా జరిగిందంటూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తరుణ్‌ అనే కండక్టర్‌ నిర్వాకంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని విన్నవించారు. ఫిర్యాదుపై స్పందించిన కూకట్‌పల్లి డిపో మేనేజర్‌..2019 అక్టోబరు 5నుంచి నవంబరు 28 వరకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సమ్మెలో పాల్గొనగా, రోజువారీ వేతనంతో పనిచేసే సిబ్బందిని నియమించుకున్నామని కమిషన్‌కు విన్నవించారు. సమ్మెకాలంలో రోజువారీ పాస్‌ ఇచ్చే సదుపాయం కల్పించలేదని, కేసు కొట్టివేయాలని కోరారు. రాతపూర్వకంగా ఇచ్చిన వివరణకు సంబంధించిన సర్క్యులర్లను మాత్రం సమర్పించలేదు. ప్రతివాద సంస్థ చెప్పే వివరాలకు ఆధారాలు లేవని పేర్కొంటూ 45రోజుల్లో రూ.10వేలు చెల్లించాలంటూ కమిషన్‌ సభ్యుడు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు