logo

జకాత్‌ జరూర్‌

రంజాన్‌ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి.

Published : 28 Mar 2024 03:26 IST

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, బోరబండ, చార్మినార్‌: రంజాన్‌ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘జకాత్‌’ గురించే. ఈ పేరు వింటే యాచకులు, పేదల ఆనందానికి హద్దులుండవు. జకాత్‌ ఎక్కడ అంటూ ఆరాతీసి వెంటనే అక్కడికి చేరుకుంటారు.  

ఇవీ నిబంధనలు..

జకాత్‌ ఇవ్వడానికి ఒక ముస్లిం దగ్గర 60.755 గ్రాములు బంగారం, 425.285 గ్రాముల వెండి లేదా దీనికి సమానమైన విలువ ఉన్న నగదు, ఇళ్లు, భూమి, వాహనాలు, ఇతర వస్తువులు ఏ రూపంలో ఉన్నా వారు జకాత్‌ ఇవ్వడానికి అర్హులు. ఉదాహరణకు ఒక్క ముస్లిం వద్ద రూ.16,200 కంటే ఎక్కువగా నగదు ఉండి ఏడాది దాటితే 40వ భాగం జకాత్‌గా చెల్లించాలి. సంపదలో 2.5శాతం పేదలకు ఇవ్వాలి. జకాత్‌ ఫిత్రాల వల్ల పుణ్యం లభిస్తుందని పలువురు మత పెద్దలు పేర్కొంటున్నారు. పవిత్ర ఖురాన్‌ గ్రంథంలో దీని గురించి పేర్కొన్నారు. మనుషుల్లోని పేద, ధనిక అసమానతలు పోగొట్టడానికి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు, కృతజ్ఞతభావం పెంపొందడానికి ఇవి దోహదపడతాయని మతపెద్దలు చెబుతున్నారు.

అందిస్తున్న సంస్థలు

జకాత్‌ ప్రధానంగా పేదవారికి, అనాథలకు, వితంతువులు, వికలాంగులకు ఇస్తారు. అయితే కొందరికి జకాత్‌ ఇవ్వకూడదన్న నిబంధనలు ఉండటంతో వారికి ప్రత్యామ్నాయంగా సాయం చేస్తుంటారు. పాతనగరంలో ఆర్‌ఆర్‌ గ్రూప్‌, మస్కటీ పాల ఉత్పత్తుల కేంద్రం వారు ఎక్కువగా జకాత్‌ అందిస్తుంటారు. ఇందులో భాగంగా నెల రోజులు పండగకు అయ్యే ఖర్చులు, బియ్యం, పప్పులు, నిత్యవసరాలు, దుస్తులు ఇస్తున్నారు.  


ఆత్మ సంతృప్తి లభిస్తుంది

- ఎంఏ అజీజ్‌, విశ్రాంత అసిస్టెంట్‌ ఇంజినీర్‌, బోరబండ.

చాలా ఏళ్లుగా జకాత్‌ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం బాధ్యతగా భావించి అవసరమైన వారికి నగదు అందిస్తున్నాం. దీని వల్ల పుణ్యంతో పాటు ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఇస్లాం ఫర్జులలో జకాత్‌ ఒకటి. జకాత్‌ను అర్హత ఉన్న ప్రతి ఒక్క ముస్లిం చెల్లించాలి. జకాత్‌ను చెల్లిస్తే మంచి జరుగుతుందని నమ్మకం.


చాలా ఏళ్లుగా ఇస్తున్నాం

- అంజద్‌ఖాన్‌, వ్యాపారి

చాలా ఏళ్లుగా జకాత్‌ అందిస్తున్నాం. ఇస్లాం మతంలో ఐదు సిద్ధాంతాలు కచ్చితంగా ఆచరించాలి. అందులో జకాత్‌ ఒకటి. రంజాన్‌ మాసంలో తమకు ఉన్న స్తోమతను బట్టి దానధర్మాలు చేస్తుంటాము. నిరుపేదలు, వితంతువులకు, ఆసరా లేని వారికి ఆసరాగా జకాత్‌ ఉపయోగపడుతుంది. జకాత్‌ ఇవ్వడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆస్తిపాస్తులు కలకాలం ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని