logo

ప్రత్యర్థులు వారే... పార్టీలు వేరే

ఐదేళ్ల కిందట లోక్‌సభ ఎన్నికల్లో వారిద్దరూ ప్రత్యర్థులు.. ఒకరు భారాస అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తే, మరొకరు భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ నుంచి పోటీ పడ్డారు. హోరాహోరీ పోరులో భారాస అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి 14వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Updated : 29 Mar 2024 04:34 IST

చేవెళ్ల లోక్‌సభ బరిలో విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మొయినాబాద్‌: ఐదేళ్ల కిందట లోక్‌సభ ఎన్నికల్లో వారిద్దరూ ప్రత్యర్థులు.. ఒకరు భారాస అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తే, మరొకరు భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ నుంచి పోటీ పడ్డారు. హోరాహోరీ పోరులో భారాస అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి 14వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఐదేళ్లు తిరిగేసరికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరూ పార్టీ మారారు. భారాసకు రాజీనామా చేసిన రంజిత్‌రెడ్డి కొద్దిరోజుల కిందట కాంగ్రెస్‌లో చేరగా.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జులై, 2022లో భాజపాలో చేరారు. మళ్లీ ఈ ఇద్దరికీ ఆయా పార్టీలు ఎంపీ అభ్యర్థులుగా టిక్కెట్లిచ్చాయి. పాత ప్రత్యర్థులు తాజాగా రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగారు. విజయం సాధించాలన్న లక్ష్యంతో ఇద్దరూ కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తుండగా, భాజపా నుంచి అగ్ర నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

కార్యకర్తలు, నాయకులతో మాటామంతి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పోటీపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్‌లోపు నియోజకవర్గమంతా ఒకసారి చుట్టిరావాలని విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలు వేర్వేరుగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భాజపా కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శేరిలింగంపల్లిలో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటుతో పాటు వికారాబాద్‌, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నాయకులను స్వయంగా కలుసుకుంటున్నారు. శుక్రవారం నుంచి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పర్యటించనున్నారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసేలోపు చేవెళ్ల నియోజకవర్గమంతా ఒకసారి పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. తుక్కుగూడలో ఏప్రిల్‌ తొలివారంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున్‌ఖర్గే, రాహుల్‌గాంధీలు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.  భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని