logo

రూ.44.68 కోట్ల లోటుతో ఉస్మానియా వర్సిటీ బడ్జెట్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కామర్స్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ అప్పారావు జమా ఖర్చులను గురువారం ప్రకటించారు.

Published : 29 Mar 2024 03:47 IST

 

బడ్జెట్‌ వివరాలు వెల్లడిస్తున్న ప్రొఫెసర్‌ అప్పారావు

ఈనాడు, హైదరాబాద్‌, లాలాపేట, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కామర్స్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ అప్పారావు జమా ఖర్చులను గురువారం ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.32.91 కోట్ల మిగులుతో కలిపి మొత్తం రూ.751.77 కోట్ల నిధులు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.796.86 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. దీంతో రూ.44.68 కోట్ల లోటు బడ్జెట్‌తో ముందుకు వెళ్లనున్నామని, ఏడాదిలోపు అంతర్గత వనరుల ద్వారా నిధులను సమీకరించుకుంటామని వివరించారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి బ్లాక్‌గ్రాంట్‌ రూపేణా రూ.487.03 కోట్లు రానున్నాయని పేర్కొన్నారు. ఆచార్యులకు యూజీసీ పేస్కేల్‌ బకాయిలు చెల్లించేందుకు ప్రత్యేక గ్రాంట్‌ రూపంలో ప్రభుత్వం నుంచి రూ.55 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో రూ.35.63 కోట్లు అంతర్గత ఆదాయం, వర్సిటీలోని సంస్థల ద్వారా 138.50 కోట్లు సమకూర్చుకుంటామన్నారు. క్యాంపస్‌లో కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల ప్రారంభించనున్నామని ఉపకులపతి ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ తెలిపారు. బడ్జెట్‌లో ఆచార్యులు, ఉద్యోగుల వేతనాలకు రూ.451.28 కోట్లు చెల్లిస్తున్నామని.. ఇది మొత్తం బడ్జెట్‌లో 56.66 శాతమన్నారు. పింఛన్లకు రూ.295 కోట్లు కేటాయించామని, మొత్తం బడ్జెట్‌లో 37.04 శాతమని తెలిపారు. రిజిస్ట్రార్‌ పి.లక్ష్మీనారాయణ, డీన్లు, ఆచార్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని