logo

ఉత్తుత్తి బుకింగ్‌లు.. జలమండలికి టోకరా

ఫేక్‌ బుకింగ్‌లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్‌ జాబితా అమాంతం పెరిగిపోతోంది.

Updated : 20 Apr 2024 06:09 IST

అంతర్గత విచారణలో గుట్టు రట్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఫేక్‌ బుకింగ్‌లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్‌ జాబితా అమాంతం పెరిగిపోతోంది. తాజాగా రోజుకు 9-10 వేల వరకూ పెండింగ్‌లో ఉంటున్నాయి. బుక్‌ చేసుకున్న 2-3 రోజులకు కానీ ట్యాంకర్లు రావడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఉత్తుత్తి బుకింగ్‌ల కారణంగానే ట్యాంకర్ల సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్నట్లు జలమండలి అంతర్గత విచారణలో తేలింది. శివార్లలోని అయిదు ఫిల్లింగ్‌ స్టేషన్ల ఇన్‌ఛార్జులపై బదిలీ వేటు వేశారు. వారిని ఫిల్లింగ్‌ స్టేషన్ల ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి వేరే విధుల్లోకి పంపారు.

సెల్‌ నంబర్లు ముందే సేకరించి.. గ్రేటర్‌ వ్యాప్తంగా 78 ఫిల్లింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వేసవి దృష్టిలో పెట్టుకొని మరో 22 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.  ప్రస్తుతం రోజుకు 7 వేలకు పైగా ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. మరో 9 వేల వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని రోజులుగా పెండింగ్‌ జాబితా 14 వేలకు పెరగడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అంతర్గత దర్యాప్తు చేయగా.. బోగస్‌ బుకింగ్‌లు జరుగుతున్నట్లు గుర్తించారు. నిఘా పెట్టడంతో దాదాపు 5 వేల బుకింగ్‌లు తగ్గిపోయాయి. కొన్ని రోజులపాటు నిత్యం 4-5 వేల ట్యాంకర్లు ఫేక్‌ బుకింగ్‌ల పేరుతో పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. నిత్యం రూ.20 లక్షల వరకు జలమండలి ఆదాయానికి కొందరు కేటుగాళ్లు గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫిల్లింగ్‌ స్టేషన్‌ పరిధిలో 50-100 మంది వినియోగదారుల సెల్‌ నంబర్లను ట్యాంకర్ల యజమానులు ముందే సేకరించి పెట్టుకుంటున్నారు. వారికి అవసరమైనప్పుడు ఉచితంగా, కొందరికి తగ్గింపు ధరలకు సరఫరా చేస్తున్నారు. మిగతా రోజుల్లో వారిద్వారా ఫేక్‌ బుకింగ్‌ చేస్తున్నారు. వినియోగదారుల నుంచి ఓటీపీ తెలుసుకొని వాటిని హోటళ్లు, హాస్టళ్లకు, ఇతర వాణిజ్య అవసరాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు పెద్దమొత్తాల్లో పంచుతున్నారు.
ఏళ్ల తరబడి ఒక్కచోటే.. గ్రేటర్‌ వ్యాప్తంగా 78 ఫిల్లింగ్‌ స్టేషన్ల పరిధిలో దాదాపు 30 మంది 5 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఒక్కచోటే ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఒకవేళ ఇతర విభాగాలకు బదిలీ చేసినా..మళ్లీ పైరవీలతో ఫిల్లింగ్‌ కేంద్రాలకు వచ్చేస్తున్న పరిస్థితి. అలాంటి వారి జాబితాను ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని