logo

కమలం జెండా భుజాన.. కాషాయ దండు నగరాన

లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని నాలుగు స్థానాల్లో పాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

Published : 22 Apr 2024 05:33 IST

4 లోక్‌సభ స్థానాల్లో ప్రచారానికి అగ్ర నేతలు
అన్నింటిలో విజయానికి కార్యాచరణ

లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని నాలుగు స్థానాల్లో పాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జనానికి దగ్గరగా ఉన్న నేతలను అభ్యర్థులుగా నిలపడంతో విజయం సులభంగా సాధించాలని భావిస్తోంది. ఇదే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు హైదరాబాద్‌కు రాబోతున్నారు. పన్నెండు మందికిపైగా కేంద్ర మంత్రులు ఓటర్లను కలవడానికి వస్తున్నారు. ప్రధాని మోదీ ఈనెల 27న పర్యటించబోతున్నారు. మరోవైపు నలుగురు అభ్యర్థులు నెల రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధాని పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదీ హైదరాబాద్‌ లోక్‌సభ పరిధి. నాలుగు ఎంపీ స్థానాల్లో సికింద్రాబాద్‌ నుంచి గత ఎన్నిల్లో కిషన్‌రెడ్డి ఒక్కరే గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడంతో పాటు రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో భాజపా ఒక్క స్థానంలోనే గెలిచినా, 12 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. కొన్ని నియోజకవర్గాల్లో లక్షకుపైగా ఓట్లను దక్కించుకుంది. ఫలితంగా కొన్నిచోట్ల కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. తద్వారా కమలానికి బలమైన ఓటు బ్యాంకు ఉందని స్పష్టమైంది. ఇప్పుడు దీన్నే ఉపయోగించుకోవాలన్నది పార్టీ అగ్రనేతల ఆలోచన. అయోధ్య రామాలయాన్ని ప్రారంభించిన తరువాత రాజధాని పరిధిలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని కమలనాథులు చెబుతున్నారు. మహా నగరం పరిధిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉన్నారు. వీరంతా అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో నగర నేతలు  ప్రధానంగా దృష్టిసారించారు. సంబంధిత వర్గం అగ్రనేతలను దిల్లీనుంచి రప్పించి వారితో మాట్లాడించడానికి ఏర్పాట్లుచేస్తున్నారు. నగరంలో ఉన్నత విద్యావంతులు, మేధావులతో ప్రధాన మోదీ ఈనెల 27న ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. ఇటీవల మాజీ సైనికులతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సమావేశానికి నిర్ణయించినా ఆయన హాజరుకాలేదు. మరోసారి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడతారని చెబుతున్నారు. భాజపా అనుబంధ సంస్థలు కూడా రంగంలోకి దిగి పెద్దఎత్తున ప్రచారంలో పాలుపంచుకుంటున్నాయి. మొత్తంగా ఏ వర్గాన్నీ వదలకుండా భాజపా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇకనుంచి ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో అగ్రనేతలతో ప్రచారానికి కార్యాచరణ రూపొందించింది.

సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి కిషన్‌రెడ్డి బరిలో నిలిచారు. ఎమ్మెల్యేగా మూడుసార్లు, ఎంపీగా ఒక్కసారి గెలిచిన అనుభవంతో మరోసారి గెలవడానికి అన్ని వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అన్ని కాలనీల్లో పర్యటిస్తూ ఓటర్లతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండటంతో మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొంటున్నా ప్రధానంగా సికింద్రాబాద్‌పైనే దృష్టి సారించారు.

ల్కాజిగిరి నుంచి బరిలో ఉన్న ఈటల రాజేందర్‌ అన్ని శక్తులను ఒడ్డి పోరాడుతున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన ఈటల మొన్నటి శాసనసభ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడంతో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. అగ్రనేతలతో భారీగా ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకున్నారు.

చేవెళ్ల అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ ఆయన మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలతో గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకున్నారు. మూడు నెలలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన భార్య, అపోలో జేఎండీ కొండా సంగీతారెడ్డి కూడా పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడా అన్ని ప్రాంతాల్లో అగ్రనేతలతో ప్రచారం చేయించనున్నారు.

హైదరాబాద్‌ అభ్యర్థిగా మాధవీలత పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఉన్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ ఎంఐఎం విజయం సాధిస్తోంది. ఈ పార్టీకి గట్టిపోటీ ఇవ్వాలనే లక్ష్యంతో, ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేసిన మాధవీలతను భాజపా బరిలో నిలిపింది. తొలుత ఇక్కడి ప్రధాన ఓటర్ల మనసు గెల్చుకోవాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. దీనికి అనుగుణంగానే ఆమె ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని