logo

ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి

ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు.

Published : 03 May 2024 06:21 IST

అధినేతల ఆదేశాలతో కిందిస్థాయి నేతల ఉక్కిరిబిక్కిరి
ప్రతిభ కనబర్చిన వారికి నామినేటెడ్‌ పదవులంటూ హామీలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాల్లో గెలవాల్సిందేనని ఓ పార్టీ అధినేత ఆదేశిస్తే.. కనీసం మూడింటిలోనైనా పార్టీ అభ్యర్థులు గెలిచి తీరాలంటూ మరో అగ్రనేత కిందిస్థాయి నాయకులకు హుకుం జారీ చేశారు. ఇందుకు ఏం కావాలో చెప్పండి.. సమకూరుస్తామంటూ హామీలు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో నామినేటెడ్‌ పదవులు, ఇతర ప్రయోజనాలు దక్కే అవకాశం ఉండటంతో నియోజకవర్గ స్థాయి నేతలు తమ పరిధిలో పార్టీ గెలుపునకు ప్రణాళికలు రూపొందించుకుని అందకనుగుణంగా పని చేయడం మొదలుపెట్టారు.

భాజపాకు ది‘షా’నిర్దేశం..

నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులు గెలవాల్సిందేనంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆ పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో పది రోజులు చేపట్టే కార్యక్రమాలపై కూడా ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ నేపథ్యంలో కీలక నేతలతో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చర్చలు జరిపారు. సరికొత్త ప్రణాళిక అమలు చేయాలంటూ నేతలపై  బాధ్యతలు మోపారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో అమిత్‌షా మాట్లాడడంతో ఆయన కూడా ప్రచారంలో  పాల్గొంటున్నారు.

రంగంలోకి దిగిన సీఎం..

వారం రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి రాజధాని పరిధిలోని నేతలతో మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల అభ్యర్థుల విజయం కోసం సీఎం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిందిస్థాయి నేతలను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించారు. వీరంతా బూత్‌స్థాయి కార్యకర్తలతో మాట్లాడి.. ప్రతి ఓటరును బూత్‌ వరకు తీసుకొచ్చి పార్టీకి ఓటేయించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిభ చూపిన నేతలకు మున్ముందు నామినేటెడ్‌ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా దానంను ఎంపిక చేయడాన్ని పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి  వ్యతిరేకించారు. సీఎం జోక్యంతో ఇప్పుడు ఆమె దానంకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సర్వే సత్యనారాయణ.. కాంగ్రెస్‌ అగ్రనేతల హామీ మేరకు పార్టీ అభ్యర్థుల ప్రచారంపై దృష్టిపెట్టారు. ఇలానే మరికొందరు నేతలు కూడా ఇప్పుడు ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు.

అన్నింటా కేటీఆర్‌నే..

శాసనసభ ఎన్నికల తరవాత కాస్త డీలాపడిన నేతల్లో జవసత్వాలు నింపి  ఈ ఎన్నికల్లో విజయం కోసం భారాస అగ్రనేత కేటీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. నగర బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు, ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరినా.. ధైర్యం కోల్పోకుండా శ్రేణులకు భరోసా ఇస్తున్నారు.  మరికొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలతో, కార్పొరేటర్లతో కూడా  ఆయన మాట్లాడారు. ఈ పది రోజుల్లో చేపట్టాల్సిన ప్రచారం, ఇతరత్రా కార్యక్రమాలు గురించి కూడా నేతలతో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని