logo

పజ్జన్న అంటే ప్రజల మనిషని తెలుసు

జనంలో ఉండే నేతకే సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని, అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే తన గెలుపు ఖరారైందని భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated : 05 May 2024 06:21 IST

భారాస సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌

నంలో ఉండే నేతకే సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని, అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే తన గెలుపు ఖరారైందని భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు రెండు, మూడుస్థానాలకే పరిమితం అంటూ జోస్యం చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజల కోసమే సాగిందని, లోక్‌సభ ఎంపీగా గెలిచినా జనంలోనే ఉంటానన్న నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పుకొచ్చారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం, జనాల నుంచి వస్తున్న స్పందన, గెలుపునకు దోహదపడే అంశాలపై ‘పజ్జన్న’ పలు విషయాలను పంచుకున్నారిలా...


ఈ ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు..? మీ దృష్టిలో వారి బలహీనతలు ఏంటి..?

భారాస, భాజపా మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అసలు పోటీలోనే లేదు. ప్రజాధరణ నాకున్న బలం. జనాలకు అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏ సమస్య వచ్చినా తలుపు తడితే పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా పనిచేసినా భవిష్యత్తులో ఎంపీగా గెలిచినా సాదాసీదాగా అందరిలో కలిసిపోతానని జనాలకు తెలుసు. సుమారు రూ.45కోట్ల మేర సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు బాధితులకు అందేలా కృషి చేశాను. ప్రత్యర్థి కిషన్‌రెడ్డి బలహీనతలూ మా గెలుపునకు కలిసి వస్తాయి. చాలాచోట్ల భాజపా క్యాడర్‌ మాకే ఓట్లేస్తామని చెబుతున్నారు. భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరు అంటూ వాళ్లే చెబుతున్నారు.


మైనార్టీ ఓటర్ల మనోగతం ఎలా ఉందనుకుంటున్నారు?

సికింద్రాబాద్‌ అసెంబ్లీ పరిధిలో ఎలాంటి తుఫాను వచ్చినా ముస్లిం మైనార్టీ ఓటర్లు నా వెంటే ఉంటారు. ఒక వేళ కాంగ్రెస్‌ అభ్యర్థి దృఢంగా ఉంటే ఓట్లు చీలిపోతాయని తొలుత అనుమానం వ్యక్తం చేశాము. కానీ ఇక్కడ కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థి మూడోస్థానంలో ఉన్నారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్‌కి మద్దతుగా నిలిచినట్లు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. వారు తటస్థంగానే ఉన్నారనుకుంటున్నాను. ఒకవేళ వారికి మద్దతుగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించినా మా వెంటే ఉంటామని ప్రజలు ముందే చెప్పారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా గెలిచిన సందర్భాలున్నాయి.


సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఏయే సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు..?

లోక్‌సభ ఎంపీ అంటే కేవలం స్థానిక సమస్యలకే పరిమితం కాకూడదు. లోక్‌సభ నియోజకవర్గంతోపాటు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో అంశాలపై దృష్టిపెడతాను. కొన్ని జాతీయ అంశాలు రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై భారాస నుంచి గెలుపొందిన ఎంపీలందరం కలిసి ప్రధాన సమస్యలపై పోరాడతాం. తెలంగాణ గొంతుకగా నిలుస్తాం.


మీ గెలుపునకు దోహదం చేసే అంశాలేంటి? మీ ఎమ్మెల్యేల నుంచి సహకారమెలా ఉంది? మీ బలం, బలహీనతలు ఏంటి..?

జనమే నా బలం.. స్థానిక సమస్యలుంటే ప్రజలే నా దృష్టికి తీసుకొచ్చే స్వేచ్ఛ ఉంది. ఏ సమస్యతో నా కార్యాలయానికి వచ్చినా పరిష్కరిస్తాననే నమ్మకం వారిలో ఉంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో నన్ను గుర్తుపట్టని వారు లేరు. ఇక్కడే పుట్టాను..ఇక్కడే పెరిగాను. వలస వచ్చిన వ్యక్తిని కాదు. ప్రతి వేడుకకు హాజరవుతుంటాను. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా రాష్ట్రమంతా నేనెవరు..? నేనేంటి..? అని అందరికీ తెలుసు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు భారాస వాళ్లే ఉన్నారన్న సంగతి మరిచిపోవద్దు. సికింద్రాబాద్‌లో నేను ఎమ్మెల్యే. సనత్‌నగర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జూబ్లీహిల్స్‌ మాగంటి గోపీనాథ్‌, ముషీరాబాద్‌ ముఠా గోపాల్‌, అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌ ఉన్నారు. వారంతా నా గెలుపు కోసం బాగా సహకరిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మా పార్టీలోనే ఉండేవారు కానీ ఈ మధ్యనే కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అభ్యర్థులను ప్రకటించినప్పుడే భారాస విజయం ఖరారైపోయింది. ప్రచారంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు తిరుగుతూ, రోడ్‌షోలు నిర్వహిస్తున్నాము. ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది.


  • భాజపా కార్యకర్తలు, మైనార్టీ ఓటర్లు మా వెంటే ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ అసలు మాకు పోటీనే కాదు. ప్రజాదరణ మాకున్న బలం.

  • జంటనగరాల్లో నన్ను గుర్తుపట్టనివారు లేరు. ఇక్కడే   పుట్టి ఇక్కడే పెరిగాను. ప్రతి వేడుకకు హాజరవుతా. ఎమ్మెల్యేగా ఉన్నా. మంత్రిగా చేసినా ఎంపీగా గెలిచినా అందరితో కలిసిపోతా.

  • కాంగ్రెస్‌ అభ్యర్థి మూడోస్థానంలో ఉన్నారు. ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్‌కి మద్దతుగా  నిలిచినట్లు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. వారు తటస్థంగానే ఉన్నారనుకుంటున్నా.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని