logo

భానుడి ఉగ్రం.. ప్రాణం భద్రం

జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44 డిగ్రీలకు పైబడి నమోదౌతున్నాయి.

Updated : 06 May 2024 05:48 IST

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనం

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44 డిగ్రీలకు పైబడి నమోదౌతున్నాయి. మే నెలలో ఎండలు ఇంకా ముదురుతున్నాయి. పెరుగుతున్న వేడి వాతావరణం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రాణాపాయానికి గురిచేస్తోంది. సిమెంటు కర్మాగారాలు, నాపరాళ్ల గనులు ఉండే తాండూరులో వేడి వాతారణం సహజంగానే ఎక్కువ. అలాంటి ఇప్పుడు భరించలేని వేడితో మరింత అవస్థ పడుతున్నారు. పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజక వర్గాల్లోనూ ఎక్కువగా నమోదౌతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ఆరెంజ్‌ జోన్‌లోకి..: సహజంగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటిస్తారు.అలాంటిది జిల్లాలో 44 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆరెంజ్‌ జోన్‌లోకి వెళ్లిందని అధికారులు ప్రకటించారు.

  • గత ఏప్రిల్‌ 28న తాండూరు పట్టణంలోని రైల్వేస్టేషన్లో ఒకరు, బస్టాండ్‌లో ఒకరు (ఇద్దరూ యాచకులే) ఎండ వేడి భరించలేక స్పృహ తప్పి చనిపోయారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి చూసిన వారు వడదెబ్బతో మృతి చెందారని ప్రకటించారు.
  • కర్ణాటక రాష్ట్రం సేడంకు చెందిన ఉపాధ్యాయురాలు రాణి బషీరాబాద్‌ మండల కేంద్రంలోని టాకీ తండా ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 1న  తాండూరు పట్టణంలోని ఓ పాఠశాలలో ఎలక్షన్‌ శిక్షణ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం బషీరాబాద్‌ వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్నారు. తలనొప్పిగా ఉందని తోటి ఉపాధ్యాయురాలికి తెలిపి కొద్ది సేపటికే వాంతి చేసుకుని పడి పోయారు. వెంటనే ఆమెను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వడదెబ్బతో ఉపాధ్యాయురాలు మృతి చెందిందని తోటి ఉపాధ్యాయులు ఆవేదన చెందారు.

ఇవిగో పాటించాల్సిన జాగ్రత్తలు  

ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో డాక్టర్‌ మూర్తి (జిల్లా ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్‌) తెలిపారు.

  • ఉదయం 6 నుంచి 9 గంటల లోపే బయటి పనులను పూర్తి చేసుకోవాలి. లేదంటే రాత్రి 8గంటల తర్వాత బయటికి వెళ్లాలి.
  • తోపుడు బండ్లపై తినుబండారాలు, ఇతరత్రా వస్తువులను విక్రయించే వారు చెట్లనీడను ఆశ్రయించాలి.  
  • వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. కాబట్టి వడదెబ్బకు గురయ్యే ప్రమాదాలున్నాయి. అందుకని వాటర్‌ బాటిల్‌ చెంతనే ఉంచుకోవాలి. తరచూ కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. ఏమాత్రం నలతగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  • ఎండలో తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే టోపీలు ధరించాలి. వేడిని నిరోధించే కాటన్‌ దుస్తులను వేసుకోవాలి.
  • వేడి వాతావరణం వల్ల శరీరం నుంచి చెమట ఎక్కువగా బయటికి వెళ్లినపుడు లీటరు నీటిలో ఓఆరెస్‌ ప్యాకెట్‌ కలిపి తాగాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని