logo

బస్తీ ఓటర్లపైనే అభ్యర్థుల ఆశలు

గ్రేటర్‌లోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బస్తీ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.

Published : 06 May 2024 03:58 IST

నాలుగు నియోజకవర్గాల్లో వారే కీలకం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బస్తీ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు కంటే ఎక్కువ శాతం ఓటర్లు బస్తీల్లో ఉన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 3-4 వేల వరకు బస్తీలు ఉండగా.. వాటిల్లో తక్కువ ఆదాయ వర్గాలవారు నివశిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చినవారు ఇక్కడే ఉంటున్నారు.  అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో గ్రేటర్‌ వ్యాప్తంగా బస్తీ ఓటర్లు కీలకంగా మారడటంతో అన్ని ప్రధాన రాజికీయ పార్టీలు ఆ దిశగా దృష్టి సారించాయి. సనత్‌నగర్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, ముషీరాబాద్‌ తదితర అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోకి వచ్చే బస్తీలు, కాలనీల్లో స్థానిక నేతలపై దృష్టి పెట్టాయి. ప్రచార కార్యక్రమాల్లో బస్తీల నుంచే ఎక్కువ శాతం జనసమీకరణ చేసే బాధ్యతలను చోటామోటా నేతలకు అప్పగిస్తున్నాయి. బస్తీల్లో  పట్టు నిరూపించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు రకరకాల వ్యుహ, ప్రతివ్యహాలు పన్నుతున్నాయి.

ఎక్కువ ఓట్లు పడేలా ప్రణాళిక.. సాధారణంగా కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలతో పోల్చితే బస్తీల నుంచే ఎక్కువ శాతం మంది ఓటు వేసేందుకు కదులుతుంటారు. ప్రతి ఓటరూ పోలింగ్‌ బూత్‌ వరకు వచ్చి ఓటు వేసేలా స్థానిక నేతలు బాధ్యత తీసుకోవడం వల్ల సహజంగా ఇక్కడ నుంచి ఎక్కువ శాతం పోలింగ్‌ జరుగుతుంటుంది. అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో ఈ పరిస్థితి ఉండదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ బస్తీ ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు వివిధ రకాల తాయిలాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల కుక్కర్లు, గడియారాలు, గొడుగులు, చీరలు లాంటివి ఇంటింటికీ పంపిణీ చేసి.. ఓటర్లు తమ వైపే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందే ఈ పంపకాలు జరిగేలా  ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యువ ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ బాధ్యతలను బస్తీల్లో చోటా మోటా నాయకులకు అప్పగిస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో ప్రచారంలో పాల్గొంటే రూ.500 ఇచ్చి, భోజనం పెడుతున్నారు. చాలామందికి ఇదో ఉపాధి మార్గంగా మారిందని అంటున్నారు. బస్తీలో ఉన్న కుల, ఇతర సంక్షేమ సంఘాలను ప్రధాన పార్టీలు లక్ష్యం చేసుకొని.. ఓట్లు రాబట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నాయి. తమను గెలిపిస్తే బస్తీల్లో ఉన్న సమస్యలపై కూడా దృష్టి పెట్టి పరిష్కరిస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని