logo

ఆఖరి ఆదివారం.. నేతల సపరివారం

ఎన్నికల ప్రచారానికి ఆఖరి ఆదివారం.. వచ్చే శనివారం సాయంత్రమే ప్రచారానికి తెరపడుతున్న వేళ..వచ్చే ఆదివారం ఎక్కడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు.

Published : 06 May 2024 04:19 IST

కాలనీలు, బస్తీల బాటపట్టిన అభ్యర్థులు, నాయకులు
సమావేశాలు, సహపంక్తి భోజనాలతో కిక్కిరిసిన ఫంక్షన్‌హాళ్లు
ఈనాడు - హైదరాబాద్‌

న్నికల ప్రచారానికి ఆఖరి ఆదివారం.. వచ్చే శనివారం సాయంత్రమే ప్రచారానికి తెరపడుతున్న వేళ..వచ్చే ఆదివారం ఎక్కడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు. దీంతో ఈ ఆదివారం నగరమంతా కోలాహలంగా మారింది. అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు కాలనీలు, బస్తీలను ఉదయం నుంచే చుట్టేశారు. సమావేశాలు, సమాలోచనలతో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడిపారు. ఉదయం అల్పాహారం నుంచే సందడి మొదలైంది. ప్రచారం ముగిసిన తర్వాత ప్రచార శిబిరాలతో పాటు కాలనీల్లో కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు ఇలా అన్నీ భోజన సమావేశాలతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి పార్కులు, కాలనీలు, బస్తీల్లో ప్రచారం చేస్తూ  11 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల వరకు కమ్యూనిటీ హాళ్లలో కుల సంఘాలు, మహిళా సంఘాలు, కాలనీ సంఘాలతో సమావేశమై ప్రచారాన్ని హోరెత్తించారు.

అపార్టుమెంట్‌ వాసులతో..

మిగతా రోజుల్లో అందరూ ఒకేచోట దొరకని పరిస్థితి ఉండడంతో.. గేటెడ్‌ కమ్యూనిటీలతో పాటు అపార్టుమెంట్లలో ఆదివారం ప్రచారం జోరుగా సాగింది. అంతటా పార్టీ అభ్యర్థులతోనే కాకుండా.. నాయకులు, ముఖ్య అనుచరులు స్వయంగా అపార్టుమెంట్లలో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కూడగట్టారు. కాలనీ సంఘాలతో సమావేశమై సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు కావడంతో నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారాన్ని హోరెత్తించారు. అందుకే విద్యార్థి సంఘాలు కూడా రంగంలోకి దిగి ఉదయం నుంచే జనం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి పార్టీ గుర్తులు, కరపత్రాలను పంపిణీ చేశారు.  

ఏసీ హాళ్లకు గిరాకీ..

ప్రస్తుతం శుభకార్యాలకు అనువైన తేదీలు లేవు. శుభముహూర్తాలు లేవు. అయినా సరే ఎన్నికల నేపథ్యంలో ఫంక్షన్‌ హాళ్లు ఏవీ ఖాళీగా ఉండడం లేదు. స్థానిక నాయకులు ముందుగానే బుక్‌ చేసి.. అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఒక పార్టీకి, తర్వాత మరో పార్టీకి అద్దెలకు ఇచ్చి ఫంక్షన్‌ హాళ్ల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం కాలనీలు, బస్తీల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్న పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎండ ముదరగానే ఏసీ హాళ్లకు చేరుకుంటున్నారు. వాటిలో సమావేశాలు నిర్వహించి అందరితో కలిసి ఫంక్తి భోజనాలు చేసి సేదతీరుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రచార వ్యయం పెరుగుతోందని అభ్యర్థులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు