logo

నిరంత విద్యుత్తుకు.. కమాండ్‌ కంట్రల్‌ సెంటర్‌

నగరంలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉంది. అగ్నిమాపక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సైతం సిద్ధమవుతోంది.

Updated : 07 May 2024 05:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉంది. అగ్నిమాపక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సైతం సిద్ధమవుతోంది. ఈ తరహాలోనే సిటీలో వేసవి డిమాండ్‌ దృష్ట్యా విద్యుత్తు పంపిణీ సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి కరెంటు సరఫరాను నిరంతరాయంగా పర్యవేక్షిస్తోంది.  

నగరంలో 44 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదుతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పనిచేస్తూనే ఉన్నాయి. వాటిని మధ్యమధ్యలో ఆపుతూ, వేస్తూ ఉన్నారు. దీంతో వినియోగంలో హెచ్చుతగ్గులతో గ్రిడ్‌ను నిర్వహించడం విద్యుత్తు ఇంజినీర్లకు సవాల్‌గా మారింది. ఓవర్‌లోడ్‌తో కొన్నిచోట్ల, ఇతరత్రా కారణాలతో పలు ప్రాంతాల్లో రోజుకు మూడు నుంచి ఏడెనిమిదిసార్లు కరెంట్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. కరెంట్‌ వెంటనే వస్తున్నా.. ఎక్కువసార్లు ట్రిప్పింగ్‌తో వినియోగదారులకు చికాకులు తెప్పిస్తోంది. గతంతో పోలిస్తే సరఫరా వ్యవస్థ మెరుగైనా.. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదులు డిస్కంకు ఇబ్బందికరంగా మారాయి. ట్విటర్‌లో వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని ఒక విభాగం పనిచేస్తోంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ.. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది. ఎవరైనా తప్పుడు ఫిర్యాదులు చేస్తే పోలీసుల దృష్టికీ తీసుకెళుతున్నారు. వార్‌రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, విధి నిర్వాహణలో ఇంజినీర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్‌ చేసేందుకూ సీఎండీ వెనకాడటం లేదు.

తొలిసారిగా ఇలా..

విద్యుత్తు వినియోగం 90 మిలియన్‌ యూనిట్లు దాటి వంద మి.యూ. దిశగా పరుగులు తీస్తుండటంతో డిస్కం యాజమాన్యం మరింత అప్రమత్తమైంది. 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉండటం.. ఎండల తీవత్ర కొనసాగే అవకాశం ఉండటంతో మొత్తం విద్యుత్తు సిబ్బందిని డిస్కం రంగంలోకి దించింది. ఇదివరకు   క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజినీర్లు, సిబ్బందే సరఫరా పర్యవేక్షణతోపాటు మరమ్మతుల విధుల్లో పాల్గొనేవారు. డిమాండ్‌ దృష్ట్యా.. ప్రతి 11కేవీ ఫీడర్‌కు షిఫ్ట్‌లవారీగా ఒక ఇంజినీర్‌ను ఇంఛార్జిగా నియమించారు. వారితోపాటూ అకౌంటింగ్‌ సిబ్బందికి సైతం ఆపరేషన్‌ విధులు అప్పగించాలని నిర్ణయించారు. కరెంట్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడటమే వారి ప్రధాన విధి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని