logo

సమయం లేదు మిత్రమా..!

సార్వత్రిక సమరం (2024) చివరి అంకానికి చేరుకుంది. ఇక మిగిలింది కేవలం 3 రోజులే కావడంతో అభ్యర్ధులు ‘సమయం లేదు మిత్రమా’ అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు.

Updated : 09 May 2024 07:01 IST

మూడు రోజుల్లో ముగియనున్న ప్రచారం

ఓట్ల వేటలో ప్రధాన పార్టీలు

న్యూస్‌టుడే, బషీరాబాద్‌, పాత తాండూరు, వికారాబాద్‌: సార్వత్రిక సమరం (2024) చివరి అంకానికి చేరుకుంది. ఇక మిగిలింది కేవలం 3 రోజులే కావడంతో అభ్యర్ధులు ‘సమయం లేదు మిత్రమా’ అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. తమవంతు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.  

 గ్రామానికి ఇద్దరు బాధ్యులు  

 ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఇప్పటికే నాయకులు సేకరించారు. వారిని రప్పించి ఓటు బలాన్ని పెంచుకోవాలని ప్రధాన పార్టీలు వ్యూహాన్ని రచిస్తున్నాయి. ఇప్పటికే గ్రామానికి ఇద్దరు చొప్పున బాధ్యులను నియమించారు.  

మీకేం కావాలంటే అది..

గత అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా, ఆయా ప్రాంతాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి.  ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి ఒక్కో ఓటరుకు ప్రత్యేకంగా సమయమిచ్చి తమవైపు తిప్పుకునే విధంగా చేయాలని గ్రామస్థాయి నేతలను ఆదేశిస్తున్నారు. ‘మీకేం కావాలో చెప్పండి.. లేదా మా నాయకుడితో ఏం పని చేయించాలో చెప్పండి.. ఎన్నికలు ముగియగానే చేయిస్తాం’ అంటూ ప్రధాన పార్టీల నాయకులు హామీలు ఇచ్చి నేతలతో ఫోన్లో  నేరుగా మాట్లాడిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలను సమావేశపరిచి ఓటు తమ పార్టీకే వేయాలంటూ ప్రసన్నం చేసుకుంటున్నారు.

హోరాహోరీ పోరు..

చేవెళ్ల బరిలో 43 మంది అభ్యర్థులున్నా ప్రధానంగా కాంగ్రెస్‌ నుంచి గడ్డం రంజిత్‌రెడి, భాజపా నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భారాస తరఫున కాసాని జ్ఞానేశ్వర్‌ల మధ్యే హోరాహోరి పోరు నెలకొంది.

  • పరిగిలో కాంగ్రెస్‌ అభ్యర్ధికి మద్దతుగా ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని, వికారాబాద్‌లో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నీ తానై పార్టీ శ్రేణులను సమన్వయ పరుస్తూ ముందుకు కదులుతున్నారు.
  •  భాజపా అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యుడు మిట్ట బాలకృష్ణారెడ్డి, నాయకులు ప్రహ్లాదరావు, బాలకృష్ణారెడ్డిలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు.  
  •  భారాస అభ్యర్ధికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అండగా నిలిచి ప్రచారం చేస్తున్నారు.  

మైనార్టీ ఓటర్లకు గాలం

పట్టణ ప్రాంతాలైన తాండూరు, పరిగి, వికారాబాద్‌లో ముస్లిం, మైనార్టీ ఓటర్లను తమవైపు మళ్లించుకునేందుకు నాయకులు ప్రతి రోజు వారి నివాసా ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం.. మీ ఓట్లు మా పార్టీకే వేయాలి.. వేయించాలి అని మాట తీసుకుంటున్నారు.  
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమై గెలుపు ఓటమిని నిర్ణయించిన నేపథ్యంలో ఈసారి వారి ఓట్లు తమ పార్టీకే పడేందుకు పట్టణ ప్రాంత నాయకులు శతవిధాలా యత్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని