logo

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. 40 మంది సస్పెన్షన్‌

పార్లమెంటు ఎన్నికల నిర్వహణను అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 40 మంది అధికారులపై జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) రోనాల్డ్‌రాస్‌ బుధవారం వేటు వేశారు.

Published : 09 May 2024 02:17 IST

ఈనాడు, హైదరాబాద్‌:  పార్లమెంటు ఎన్నికల నిర్వహణను అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 40 మంది అధికారులపై జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) రోనాల్డ్‌రాస్‌ బుధవారం వేటు వేశారు. ఇప్పటికే వంద మందికిపైగా అధికారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. అయినప్పటికీ 250 మందిలో మార్పు రాలేదని, చివరి దశ శిక్షణ తరగతులకూ గైర్హాజరవడంతో అందులోని పీఓ (ప్రిసైడింగ్‌ అధికారి), ఏపీఓ (సహాయ ప్రిసైడింగ్‌ అధికారి) స్థాయిలోని అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన 210 మంది 9, 10 తేదీల్లో జరగనున్న తుది దశ శిక్షణ తరగతులకు హాజరవ్వాల్సి ఉందన్నారు.

అభ్యర్థులు పెరగడంతో..: హైదరాబాద్‌ పార్లమెంటుకు 30 మంది, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి 45 మంది బరిలో ఉన్నారు.  కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు 15 మంది పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఒక బ్యాలెట్‌ యూనిట్‌ అసెంబ్లీకి, 22 మంది ఎంపీ అభ్యర్థులకు రెండు చొప్పున బ్యాలెట్‌ యూనిట్లను వేర్వేరుగా ఏర్పాటు చేయాలి. వాటన్నింటినీ సమన్వయం చేసుకోడానికి ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పీఓ, ఇద్దరు ఏపీఓలు, ముగ్గురు ఓపీఓలు అవసరం. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పార్లమెంటు ఎన్నికలు జరగనున్న 14 అసెంబ్లీ స్థానాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రం.. ఒక పీఓ, ఇద్దరు ఏపీఓలు, ఒక ఓపీఓ మాత్రమే ఉంటారు. బ్యాలెట్‌ యూనిట్ల సంఖ్య సికింద్రాబాద్‌ పరిధిలోని పీఎస్‌లలో మూడు చొప్పున, హైదరాబాద్‌లోని పీఎస్‌లలో రెండు చొప్పున ఉంటాయి. మొత్తంగా 12వేల బ్యాలెట్‌ యూనిట్లను ఎన్నికల్లో ఉపయోగించాల్సి ఉంది. ఈ లెక్కలన్నీ వేసుకుంటే.. ఎంపిక చేసిన 19,500 మంది విధుల్లో ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని