logo

పశు సంపద సంరక్షణకు భరోసా

పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని అమలు చేయనున్నారు.జిల్లాలో 45 రోజుల పాటు నిర్విరామంగా వ్యాక్సినైజేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో పశువుల సంఖ్య

Published : 17 Jan 2022 02:47 IST

గాలికుంటు వ్యాధి నిర్మూలనకు టీకా
జిల్లాలో తుది దశకు చేరిన పంపిణీ
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ఆవుకు టీకా వేస్తున్న పశువైద్య సిబ్బంది

పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని అమలు చేయనున్నారు.జిల్లాలో 45 రోజుల పాటు నిర్విరామంగా వ్యాక్సినైజేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో పశువుల సంఖ్య 1,46,579 కాగా వీటిలో టీకా వేయడానికి 1,24,592 అర్హత ఉన్నవిగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తుండగా ఇప్పటివరకు 1,17,377 మూగజీవాలకు పంపిణీ పూర్తయింది. గాలికుంటు వ్యాధి నిర్మూలనకు ఏడాదిలో రెండు సార్లు టీకా ఇస్తున్నారు. ఉచితంగా టీకా వేస్తుండటంతో రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తోంది.

45 రోజులు..    39 బృందాలు
పశువులకు సోకే గాలికుంటు వ్యాధిని అదుపులోకి తెచ్చేందుకు వైద్య సిబ్బంది ముందస్తు సేవలందిస్తున్నారు. జాతీయ పశు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వ్యాక్సిన్‌ సరఫరా చేస్తోంది.
గాలికుటు వ్యాధి బారిన పడిన మూగజీవాల నాలుకపై పొక్కులు వస్తుంటాయి. నాలుకపై ఉన్న చర్మం లేచిపోతుంది. అలాగే గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతుంటాయి. తీవ్ర అనారోగ్యంతో ఆహారం తీసుకోలేవు. తీవ్ర జ్వరం ఉంటుంది. పాల ఉత్పత్తి తగ్గుతుంది. గర్భం దాల్చిన పశువులకు గర్భస్రావం అవుతుంది.
గాలికుంటు వ్యాధి నియంత్రణకు నాలుగు నెలల వయసు దాటిన మూగజీవాలకు టీకా ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మండల పశువైద్యాధికారులు, ఇతర సిబ్బందితో కలిసి 39 బృందాలను ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు కొనసాగించారు.

వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించే టీకా పంపిణీపై పర్యవేక్షణ పెంచుతున్నారు. అక్రమాలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు వివరాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తున్నారు. రైతు పేరు, పశువు, గేదె, చరవాణి నెంబరు నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోని జాబితా ఆధారంగా రైతులకు నేరుగా చరవాణిలో సంప్రదిస్తున్నారు. టీకా వేశారా? కొత్త సిరంజన్‌ వినియోగించారా? వైద్య సిబ్బంది ఇంటికే వచ్చారా? అని ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 200 మందికి పైగా రైతులను సంప్రదించినట్లు అధికారులు చెబుతున్నారు.

నాటు వైద్యమే దిక్కు
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పెద్దపల్లి, మంథని, గోదావరిఖని పట్టణాల్లో ప్రాంతీయ వైద్యశాలలుండగా 21 ప్రాథమిక కేంద్రాలు, 15 ఉప కేంద్రాల ద్వారా మూగజీవాలకు వైద్య సేవలందిస్తున్నారు. వీటిలోని సిబ్బందితో పాటు గోపాలమిత్రలు కూడా పశు సంరక్షణలో భాగస్వాములవుతున్నారు. కాగా పశువైద్య కేంద్రాల్లో సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా చోట్ల నాటువైద్యమే దిక్కవుతోంది. సిబ్బంది అందుబాటులో లేక, ఉన్నా సకాలంలో సేవలందించక రైతులు ప్రత్యామ్నాయంగా ఆకుపసరు వాడుతున్నారు. ఎర్రటి ఇనుప చువ్వలతో పశువులకు వాతలు పెడుతున్నారు. కొన్ని చోట్ల గాలికుంటు వ్యాధి సోకిన పశువును రోజుల తరబడి బురద నీటిలోనే ఉంచే పరిస్థితి నెలకొంది.


ప్రత్యేక కార్యాచరణ: రవీందర్‌రెడ్డి, సహాయ సంచాలకులు(సాంకేతిక విభాగం)
పశువులకు గాలికుంటు వ్యాధి నిర్మూలన టీకా పంపిణీకి జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. అర్హులైన మూగజీవాలను గుర్తించి వ్యాక్సినైజేషన్‌ పూర్తి చేశాం. మా సిబ్బంది ఇంటింటికీ వెళ్లారు. ప్రతి టీకా పంపిణీ వివరాలనూ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని