logo

ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్‌ సెగ

అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్‌ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.

Published : 26 Apr 2024 03:09 IST

రెండేళ్ల తరవాత 13 మందిపై క్రమశిక్షణ చర్యలు

వేములవాడ, న్యూస్‌టుడే: అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్‌ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. విజిలెన్స్‌ అధికారులు రాజన్న ఆలయంలో రెండేళ్ల క్రితం పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా 13 మంది ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారని దేవాదాయశాఖకు నివేదిక పంపించారు. ఇందులో ముగ్గురు ఏఈవోలు, నలుగురు పర్యవేక్షకులు, సీనియర్‌ సహాయకుడు, ఇద్దరు జూనియర్‌ సహాయకులు,  మరో ఇద్దరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు ఓ నాయీ బ్రాహ్మణుడు ఉన్నాడు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మూడు రోజుల క్రితం ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏఈవోలకు, పలువురు ఉద్యోగులకు ఏడాది పాటు ఇంక్రిమెంట్లను నిలిపివేశారు. అప్పట్లో ప్రసాదం విభాగంలో పని చేసిన పర్యవేక్షకుడు రూ. 1.88 లక్షలు, ఇదే విభాగంలో పని చేసిన జూనియర్‌ సహాయకుడు రూ.80 వేలను పదిహేను రోజుల్లో ఆలయ ఖజానాలో జమ చేయాలని ఆదేశించారు. గోదాం నిల్వలో వ్యత్యాసం ఉండగా దాని విలువను అంచనా వేసి రూ.21 వేలు చెల్లించాలని ఆ విభాగం పర్యవేక్షకుడికి స్పష్టం చేశారు. కల్యాణకట్టలో భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఓ నాయీబ్రాహ్మణుడిని తొలగించాలని ఆదేశించారు. మూడు రోజుల క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌ రాజన్న ఆలయానికి రావడం, విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చకా చకా జరిగిపోయాయి. 2021లో విజిలెన్స్‌ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని